Tollywood-AOT: మన తెలుగు చిత్ర పరిరమలో మంచి సినిమాలను ప్రోత్సహించడంలో, కొత్త దర్శకులను, నటీనటులను అభినందించడంలోనూ మెగాస్టార్ చిరంజీవి అందరిమటే ముందుంటారు. ఈ నేపథ్యంలోనే తాజాగా.. దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి జంటగా నటించిన ‘ఆకాశంలో ఒక తార’ సినిమాను చిరంజీవి ప్రత్యేకంగా వీక్షించారు. అనంతరం సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు.
ముఖ్యంగా, ‘ఆకాశంలో ఒక తార’ చిత్రం నా హృదయాన్ని ఎంతగానో కదిలించింది.. సెకండాఫ్ చూస్తున్నంతసేపు భావోద్వేగానికి గురయ్యాను అంటూ తెలిపారు మెగాస్టార్. దర్శకుడు పవన్ సాధినేని ఎంతో స్ఫూర్తిదాయకమైన కథను అద్భుతంగా రూపొందించారని చిరంజీవి అభినందించడం విశేషం. హీరో దుల్కర్ సల్మాన్, హీరోయిన్ సాత్విక వీరవల్లి తమ సహజమైన నటనతో సినిమాలో పాత్రలకు ప్రాణం పోశారంటూ వారిపై ప్రశంసల వర్షం కురిపించారు.
ఇక, శ్రుతి హాసన్.. రుహానీ శర్మతో పాటు మిగిలిన నటీనటులందరూ కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారని ఈ సందర్భంగా చిరంజీవి పొగడ్తలతో ముంచేశారు. అలాగే, టెక్నికల్ టీమ్ పనితీరును కూడా మెగాస్టార్ ప్రత్యేకంగా చెప్పుకొచ్చారు. మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కుమార్ అందించిన సంగీతం, సుజిత్ సారంగ్ సినిమాటోగ్రఫీ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయని చిరు పేర్కొన్నారు. అంతేకాదు, ఈ కథలోని భావోద్వేగాలను ప్రేక్షకులకు మరింత చేరువ చేయడంలో ఈ విభాగాలన్నీ కూడా అత్యంత కీలక పాత్రను పోషించాయని ప్రశంసించారు.
పిల్లలతో కలిసి చూడాల్సిన సినిమా అన్న చిరు!
ఇక ఈ మూవీ గురించి చిరంజీవి చెప్పిన మరో కీలకమైన విషయం.. తల్లిదండ్రులకు ఇచ్చిన సూచన.. ప్రతి ఒక్కరూ తమ పిల్లలతో కలిసి ‘ఆకాశంలో ఒక తార’ చిత్రాన్ని చూడాలని కోరడం ఆకట్టుకుంది. ఈ కథ పిల్లల్లో గొప్ప స్ఫూర్తిని నింపుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
‘ఆకాశంలో ఒక తార’ సినిమా గురించి ఇప్పటికే దర్శకధీరుడు రాజమౌళి కూడా ప్రశంసలు కురిపించగా, తాజాగా మెగాస్టార్ చిరంజీవి నుంచి కూడా ప్రశంసలు రావడం యూనిట్ సభ్యులకి మరింత ఉత్సాహాన్నిస్తోంది. కాగా, స్వప్న సినిమా.. గీతా ఆర్ట్స్.. లైట్‌బాక్స్ మీడియా కలిసి నిర్మించిన ఈ సినిమాకి పవన్ సాధినేని దర్శకత్వం వహించారు.
