Cm Revanth: తెలంగాణ నీటి హక్కుల విషయంలో బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. బీఆర్ఎస్ టార్గెట్ గా నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు నీళ్లు దోచిపెడుతోందని, కృష్ణా జలాలను ఏపీకి తాకట్టు పెట్టామని బీఆర్ఎస్ అసత్య ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. పదే పదే దుష్ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని ధ్వజమెత్తారు. నాగార్జున సాగర్ వద్ద ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న పల్నాడు వాటర్ గ్రిడ్ ను మేము అడ్డుకోలేదు అన్నట్లుగా బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తోందని విరుచుకుపడ్డారు రేవంత్. హైదరాబాద్ బోధి పెవిలియన్లో మీడియాతో సమావేశంలో సీఎం రేవంత్ మాట్లాడారు.
పల్నాడు వాటర్ గ్రిడ్ కు బీఆర్ఎస్ హయాంలోనే ఒప్పందం
వాస్తవానికి తెలంగాణ నీటి హక్కులను శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్ కు తాకట్టు పెట్టిందే బీఆర్ఎస్ అని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ ను బద్నాం చేసేందుకే బీఆర్ఎస్ కుట్రలు అని ఆరోపించారు. పల్నాడు వాటర్ గ్రిడ్ కు బీఆర్ఎస్ హయాంలోనే ఒప్పందం జరిగిందని తెలిపారు. కేసీఆర్, జగన్ మధ్య సత్సంబంధాలు ఉన్నప్పుడే ఈ జీవో వచ్చిందని వెల్లడించారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు దీనిపై జీవో విడుదలైందని వివరించారు. 2024లోపే పూర్తి చేయాలని జగన్ జీవో ఇచ్చారని రేవంత్ పేర్కొన్నారు. ఏపీ సర్కార్ జీవోకు కేసీఆర్ అభ్యంతరం చెప్పలేదన్నారు. వాటర్ గ్రిడ్ కు కేంద్రం నిధులు ఇచ్చినప్పుడు కూడా కేసీఆర్ అభ్యంతరం తెలపలేదన్నారు రేవంత్ రెడ్డి.
గురుదక్షిణ కింద కృష్ణా జలాలు వైఎస్ఆర్కు తాకట్టు
''పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు పాపంలో మీ భాగస్వామ్యం లేదా? హరీశ్ రావుకు నిజమైన గురువు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. గురుదక్షిణ కింద కృష్ణా జలాలను వైఎస్ఆర్ కు తాకట్టు పెట్టిన వ్యక్తి హరీశ్ రావు. 2004-05 బడ్జెట్ లో తెలుగు గంగా ప్రాజెక్ట్ కింద పోతిరెడ్డిపాడు నుంచి బనకచర్లకు నీళ్లు తరలించాలని పెట్టారు. ఆనాడు మీరు మంత్రులు కదా? ఈ పాపం మీదే కదా? పోతిరెడ్డిపాడు కెపాసిటీ పెంచి రాయలసీమకు నీళ్లు తరలించడానికి అనుమతి ఇచ్చారు. తెలంగాణ నీటి హక్కులపై మరణశాసనం రాసింది కేసీఆర్, హరీశ్ రావు కాదా? తెలంగాణ సీఎంగా, సాగునీటిపారుదల శాఖ మంత్రిగా మామ అల్లుళ్లు కలిసి సంతకం పెట్టారు'' అని రేవంత్ రెడ్డి తెలిపారు.
నాడు వైఎస్ఆర్ మోచేతి నీళ్లు తాగింది మీరే
''24-7-2004.. 40 టీఎంసీలు హంద్రీనీవా-సుజల స్రవంతి ద్వారా శ్రీశైలం బ్యాంక్ వాటర్స్ నుంచి తరలించడానికి ఆనాటి జీవో. రెండోసారి జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ముచ్చుమర్రి వచ్చింది. రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు మాల్యాల పెడితే మొదటి విడత 40 టీఎంసీలు ఇస్తే అక్కడి నుంచి నీళ్లు అందుతాయో లేదో అనే అనుమానం ఉంటే శ్రీశైలం డెత్ స్టోరేజ్ నుంచి కూడా మీరు తరలించుకపోండి అని చెప్పి మళ్ళీ ముచ్చుమర్రికి అనుమతి ఇచ్చారు.
నాడు వైఎస్ దయతో మంత్రి అయింది హరీష్ రావు. నాడు వైఎస్ఆర్ మోచేతి నీళ్లు తాగింది టీఆర్ఎస్. మరి హంద్రీనీవా 40 టీఎంసీల నీళ్లు తరలించుకోపోవడానికి అనుమతులు ఇచ్చిన రోజున మంత్రివర్గంలో హరీష్ రావు ఉన్నారు. తెలంగాణ నీటి హక్కుల పట్ల శాశ్వత జల సమాధి చేసింది కేసీఆర్, హరీశ్ కాదా? వీళ్ళు మంత్రివర్గంలో ఉన్నప్పుడే 2004 నుంచి 2005 రిజైన్ చేసే లోపల వీటన్నిటికీ ఇచ్చిన అనుమతులు జీవోలు.. ఈ జీవోల కొనసాగింపే జరుగుతున్న పనులు పరిణామాలు. ఈ రకంగా ఆధారాలు ఉంటే మళ్లీ మా మీదనే దాడి చేసి, మేము అన్యాయం చేశాం అన్నట్టుగా ఈరోజు మాట్లాడుతున్నారు'' అని విరుచుకుపడ్డారు రేవంత్ రెడ్డి.
