AP: ఆంధ్రప్రదేశ్లో ఇటీవల జరిగిన తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో అధికార ఎన్డీయే కూటమి భారీ విజయం సాధించినప్పటికీ, జనసేన పార్టీ గెలుచుకున్న స్థానాల సంఖ్యపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. ముఖ్యంగా వైసీపీ శ్రేణులు, కొందరు రాజకీయ విశ్లేషకులు పంచాయతీ పోరులో జనసేన ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదని, క్షేత్రస్థాయిలో పార్టీకి ఇది ఒక ఎదురుదెబ్బ అని విమర్శలు గుప్పిస్తున్నారు.
అధికారంలో ఉన్నా.. 200 మార్కు దాటలేకపోయిందా?
తొలి విడతలో మొత్తం 3,949 సర్పంచ్ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల కాగా, 760 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన స్థానాలకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ మద్దతుదారులు 2,326 పంచాయతీలను కైవసం చేసుకోగా, వైసీపీ బలపరిచిన అభ్యర్థులు 1,111 స్థానాల్లో విజయం సాధించారు. అయితే, జనసేన మద్దతు నిలిపిన అభ్యర్థులు కేవలం 189 స్థానాలకే పరిమితమయ్యారు. బీజేపీ 25, స్వతంత్రులు, ఇతరులు 293 స్థానాల్లో గెలుపొందారు. అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోనూ మెరుగైన ఫలితాలు సాధించిన జనసేన.. పంచాయతీ ఎన్నికల్లో ఇంత తక్కువ స్థానాలకు పరిమితం కావడంపై విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. స్వయంగా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉండి గ్రామాల అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నప్పటికీ, ఆ ప్రభావం సర్పంచ్ స్థానాల్లో కనిపించలేదని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
చివరి నిమిషంలో ‘ఫ్రీ హ్యాండ్’..
జనసేన తక్కువ స్థానాలు గెలవడానికి పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయంలోని జాప్యమే ప్రధాన కారణమని కొందరు జనసేన కార్యకర్తలు, విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పంచాయతీ ఎన్నికల్లో కూటమి పొత్తులు ఉండవని, జనసేన నాయకులు, వీర మహిళలు ఎవరైనా స్వేచ్ఛగా నామినేషన్లు వేయవచ్చని పవన్ కళ్యాణ్ నవంబర్ 22న ప్రకటించారు. అప్పటికే తొలి, రెండో విడతల ప్రక్రియ పూర్తికావడంతో పాటు, మూడో విడత నామినేషన్ల గడువు ముగియడానికి కేవలం ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉంది.
పొత్తు ఉండదని, ఎవరికి వారు పోటీ చేసుకోవచ్చనే స్పష్టతను తొలి విడత నామినేషన్లకు ముందే ఇచ్చి ఉంటే.. రాష్ట్రవ్యాప్తంగా మరింత మంది జనసేన అభ్యర్థులు బరిలో నిలిచేవారని, గెలిచే స్థానాల సంఖ్య కూడా పెరిగేదని సొంత పార్టీ శ్రేణుల్లోనే చర్చ జరుగుతోంది. ఆలస్యంగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వల్ల అప్పటికే చాలా గ్రామాల్లో టీడీపీ మద్దతుదారులు బరిలోకి దిగడం, జనసేన శ్రేణులు పోటీకి దూరంగా ఉండటం జరిగిపోయిందని రాజకీయ వర్గాలు అంటున్నాయి.
జనసేన నేతల వివరణ ఏంటి?
మరోవైపు, పంచాయతీ ఎన్నికల్లో పార్టీ విఫలమైందన్న విమర్శలను జనసేన నాయకులు ఖండిస్తున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు అధికారికంగా పార్టీ గుర్తులపై జరగవని, ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేసిందనే అధికారిక లెక్కలు ఉండవని వారు గుర్తు చేస్తున్నారు. అంతేకాకుండా, గ్రామీణ స్థాయిలో ఓట్లు చీలిపోయి వైసీపీకి ప్రయోజనం కలగకూడదనే వ్యూహంతోనే చాలా జిల్లాల్లో టీడీపీ, జనసేన కలిసి ఉమ్మడి అభ్యర్థులను బరిలోకి దింపాయని స్పష్టం చేస్తున్నారు. కూటమి సాధించిన మొత్తం 2,540 విజయాల్లో జనసేన మద్దతు, పాత్ర కీలకంగా ఉందని చెబుతున్నారు. ఏదేమైనా, పార్టీ గుర్తు లేని గ్రామీణ ఎన్నికల్లో సత్తా చాటాలంటే క్షేత్రస్థాయిలో సంస్థాగత బలాన్ని మరింత పెంచుకోవాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు సూచిస్తున్నారు.
