వ్యాపారం

RBI Guidelines: ఏటీఎం యూజర్లకు శుభవార్త.. ఛార్జీల నియంత్రణ, అలర్టులపై  ఆర్బీఐ కొత్త రూల్స్!

ఏటీఎం, పాయింట్ ఆఫ్ సేల్ (POS) టెర్మినళ్ల ద్వారా నగదు ఉపసంహరణకు సంబంధించి భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. 2008 నుంచి 2022 మధ్య జారీ చేసిన 17 పాత ఉత్తర్వులను రద్దు చేసి, నిబంధనలన్నింటినీ ఒకే చోటకు చేర్చింది. ఖాతాదారులు నెలలో ఎన్ని ఉచిత ఏటీఎం(ATM) లావాదేవీలు పూర్తి చేసుకున్నారు.

 ఏటీఎం, పాయింట్ ఆఫ్ సేల్ (POS) టెర్మినళ్ల ద్వారా నగదు ఉపసంహరణకు సంబంధించి భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. 2008 నుంచి 2022 మధ్య జారీ చేసిన 17 పాత ఉత్తర్వులను రద్దు చేసి, నిబంధనలన్నింటినీ ఒకే చోటకు చేర్చింది. ఖాతాదారులు నెలలో ఎన్ని ఉచిత ఏటీఎం(ATM) లావాదేవీలు పూర్తి చేసుకున్నారు. పరిమితి మించితే ఎంత రుసుము(Charges) పడుతుందనే వివరాలను ఎప్పటికప్పుడు అలర్టుల ద్వారా తప్పనిసరిగా తెలియజేయాలని బ్యాంకులను ఆదేశించింది. అదేవిధంగా ఏటీఎం మెట్రో నగరం(Metro city)లో ఉందా, నాన్-మెట్రో ప్రాంతం(Non-Metro city)లో ఉందా అన్నది స్పష్టంగా తెలిసేలా బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించింది.

 ఉచిత లావాదేవీలు.. ఛార్జీల పరిమితి ఇదే

తక్షణమే అమల్లోకి వచ్చిన ఈ నిబంధనలు షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకులు, పేమెంట్ సిస్టమ్ ప్రొవైడర్లకు వర్తిస్తాయి. ఉచిత లావాదేవీల పరిమితుల్లో ఎలాంటి మార్పు చేయలేదు—సొంత బ్యాంక్ ఏటీఎంలలో నెలకు 5 ఉచిత లావాదేవీలు (ఆర్థిక, ఆర్థికేతర) కొనసాగుతాయి.

ఇతర బ్యాంక్ ఏటీఎంలలో మెట్రో నగరాల్లో 3, నాన్-మెట్రో ప్రాంతాల్లో 5 ఉచిత లావాదేవీలు యథాతథంగా ఉంటాయి. ఉచిత పరిమితి దాటితే ఒక్కో లావాదేవీకి గరిష్ఠంగా రూ.23తో పాటు పన్నులు మాత్రమే వసూలు చేయాలి. ఉపసంహరణ పరిమితులు, ఉచిత లావాదేవీలు, ఛార్జీల వివరాలను ఇంగ్లిష్, హిందీతో పాటు స్థానిక భాషలో ఏటీఎం వద్ద ప్రదర్శించాలి.

 విఫల లావాదేవీలపై రుసుము నిషేధం.. పీఓఎస్ నగదు సదుపాయం

సాంకేతిక లోపాలు, హార్డ్‌వేర్ లేదా సాఫ్ట్‌వేర్ సమస్యలు, సర్వర్ వైఫల్యం, ఏటీఎంలో నగదు లేకపోవడం వంటి కారణాలతో విఫలమయ్యే లావాదేవీలను ఉచిత పరిమితిలో కలపకూడదని ఆర్బీఐ స్పష్టం చేసింది. బ్యాంక్ లేదా సర్వీస్ ప్రొవైడర్ తప్పిదం వల్ల లావాదేవీ తిరస్కరణకు గురైనా ఖాతాదారులపై ఛార్జీలు విధించరాదని తేల్చి చెప్పింది.

మరోవైపు వ్యాపార సంస్థల వద్ద పీఓఎస్ టెర్మినళ్ల ద్వారా డెబిట్ కార్డులు, పూర్తి కేవైసీ ప్రీపెయిడ్ కార్డులు, యూపీఐ సాయంతో ఒక లావాదేవీకి గరిష్ఠంగా రూ.2వేలు, నెలకు రూ.10వేల వరకు నగదు తీసుకోవచ్చు. దీనిపై ఛార్జీ విధిస్తే లావాదేవీ విలువలో 1 శాతానికి మించకూడదు. కొనుగోళ్లు చేయకపోయినా నగదు తీసుకునే వెసులుబాటు ఉండగా, కొనుగోళ్లతో కలిపి తీసుకుంటే రశీదుపై ఆ మొత్తాన్ని విడిగా చూపించాలి.

తర్వాత చదవండి