BRS Party: తెలుగు రాష్ట్రాల్లో ‘పాదయాత్ర’ అనేది రాజకీయ నాయకులకు ఒక తిరుగులేని సెంటిమెంట్. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల మధ్యకు నడిచి వెళ్లి, ఆ తర్వాత అధికారం దక్కించుకున్న నేతల జాబితా చాలా పెద్దదే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి నుంచి మొదలుపెడితే.. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, నారా లోకేష్, ఇటు తెలంగాణలో రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క వరకు అంతా పాదయాత్రలతోనే పవర్ ఛైర్ అందుకున్న వాళ్లే. ఇప్పుడు సరిగ్గా అదే సెంటిమెంట్‌ను నమ్ముకుని, మళ్లీ తెలంగాణలో గులాబీ జెండా ఎగురవేయడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భారీ స్కెచ్ వేస్తున్నట్లు తెలుస్తోంది. మరి గతంలో ఎందరో నేతలకు కలిసొచ్చిన ఈ ‘పాదయాత్ర’ సెంటిమెంట్, కేటీఆర్ విషయంలోనూ వర్కౌట్ అవుతుందా అన్నది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
అధికారం కోసం అదే సెంటిమెంట్ అస్త్రం
అధికారం కోల్పోయినప్పటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు, హామీల అమలుపై నిలదీతలు, రైతులు, నిరుద్యోగులు, మహిళల సమస్యలపై పోరాటాలతో బీఆర్ఎస్ నిత్యం జనం మధ్య ఉండే ప్రయత్నం చేస్తోంది. అయితే, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి పవర్లోకి రావాలంటే కేవలం సభలు, విమర్శలు సరిపోవని.. కేటీఆర్ స్వయంగా పాదయాత్ర చేస్తేనే కేడర్‌లో కొత్త జోష్ వస్తుందని, ప్రజల్లో సానుకూలత పెరుగుతుందని పార్టీ అధిష్ఠానం బలంగా నమ్ముతోంది. వచ్చే ఏడాది పాదయాత్ర ఉంటుందని ఇప్పటికే కేటీఆర్ పలు సందర్భాల్లో హింట్ కూడా ఇచ్చారు.
2027 మార్చి టు 2028 మార్చి.. పక్కా టైమింగ్
బీఆర్ఎస్ వర్గాల్లో నడుస్తున్న ఇంటర్నల్ టాక్ ప్రకారం.. 2027 ఫిబ్రవరి లేదా మార్చిలో కేటీఆర్ పాదయాత్ర మొదలయ్యే ఛాన్స్ ఉంది. అప్పటికి రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి మూడేళ్లు పూర్తవుతుంది కాబట్టి, సహజంగానే ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలవుతుందని, జనంలోకి వెళ్లడానికి అదే కరెక్ట్ టైమ్ అని గులాబీ పెద్దలు లెక్కలేస్తున్నారు. అంతేకాదు, వచ్చే మార్చికల్లా నియోజకవర్గాల పునర్విభజనపై కూడా ఒక క్లారిటీ వస్తుంది కాబట్టి, ఏ నియోజకవర్గంలో ఎవరిని హైలైట్ చేయాలనే విషయంపైనా స్పష్టత ఉంటుందని భావిస్తున్నారు.
2027 మార్చిలో మొదలుపెట్టి, 2028 మార్చి వరకు.. అంటే ఏకంగా ఏడాది పాటు ఈ యాత్ర కొనసాగేలా కేటీఆర్ టీమ్ రూట్ మ్యాప్ సిద్ధం చేస్తోందట. సాధారణ ఎన్నికలకు సరిగ్గా ఆరు నెలల ముందు పాదయాత్రను ముగించి, ఆ తర్వాత పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రచారంలోకి దిగాలన్నది గులాబీ బాస్ వ్యూహంగా తెలుస్తోంది.
పాత ఫార్ములాకు కొత్త టచ్..
గతంలో నేతలు చేసిన పాదయాత్రల సక్సెస్ ఫార్ములాను ఇప్పటి పరిస్థితులకు తగ్గట్టుగా మార్చి, మరింత కొత్తగా ప్రజెంట్ చేయాలని కేటీఆర్ టీమ్ ప్లాన్ చేస్తోంది. కేవలం రాజకీయ ప్రసంగాలకే పరిమితం కాకుండా.. గ్రామాలు, పట్టణాల్లోని సామాన్య ప్రజలతో నేరుగా మమేకమై ‘మీకు నేనున్నాను’ అనే భరోసా ఇచ్చేలా వ్యూహం రచిస్తున్నారు. యాత్ర ప్రారంభం కావడానికి ముందే పార్టీ కమిటీలన్నింటినీ నియమించి, కొత్త కమిటీల భుజాలపైనే పాదయాత్ర బాధ్యతలు పెట్టాలని చూస్తున్నారు.
మొత్తానికి మరో నాలుగు నెలల్లో పాదయాత్ర మొదలయ్యే అవకాశం ఉండటంతో, ఇప్పటి నుంచే షెడ్యూల్, రూట్ మ్యాప్‌పై కేటీఆర్ టీమ్ కసరత్తు చేస్తోంది. పార్టీ అధినేత కేసీఆర్ తుది ఆమోదంతో దీనిపై అధికారిక ప్రకటన రానుంది. మరి వైఎస్సార్, బాబు, రేవంత్ బాటలో నడవడానికి సిద్ధమవుతున్న కేటీఆర్‌కు.. ఆ పాదయాత్ర సెంటిమెంట్ మళ్లీ అధికారాన్ని తెచ్చిపెడుతుందో లేదో చూడాలి.
