North vs South: దేశ రాజకీయ ముఖచిత్రాన్ని శాశ్వతంగా మార్చేసే నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రతిపాదన ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో ఆందోళనకు కారణమవుతోంది. ప్రస్తుతం 543గా ఉన్న లోక్‌సభ స్థానాలను ఏకంగా 816కు పెంచేలా కేంద్రం వేస్తున్న అడుగులు 'ఉత్తర - దక్షిణ' భారత్ మధ్య తీవ్ర అసమానతలకు దారితీస్తాయన్న చర్చ జోరందుకుంది. అన్ని రాష్ట్రాలకు సమానంగా 50 శాతం సీట్లు పెంచుతున్నామని పైకి చెబుతున్నప్పటికీ.. లోతుగా లెక్కలు తీస్తే దేశ అధికార పీఠాన్ని శాసించే శక్తి పూర్తిగా ఉత్తరాది చేతుల్లోకి వెళ్లిపోయి, దక్షిణాది రాష్ట్రాల ప్రాధాన్యత నామమాత్రంగా మారిపోయే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది.
అంకెల గారడీ ఇదే.. దక్షిణాదికి 195, ఉత్తరాదికి 400 ప్లస్!
లోక్‌సభ బలం 816కు చేరితే కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 409 సీట్లు అవుతుంది. కొత్త నమూనాలో రాష్ట్రాల వారీగా పెరిగే సీట్ల సంఖ్యను పరిశీలిస్తే, దక్షిణాదికి జరుగుతున్న అన్యాయం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది.
దక్షిణాది వాటా 195 మాత్రమే..
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ ఈ ఐదు రాష్ట్రాల్లో ప్రస్తుతం 129 లోక్‌సభ స్థానాలు ఉండగా, 816 సీట్ల మోడల్లో ఇవి 195కు మాత్రమే చేరుతాయి. రాష్ట్రాల వారీగా చూస్తే తమిళనాడులో ప్రస్తుతం ఉన్న 39 సీట్లు 59కి, కర్ణాటకలో 28 సీట్లు 42కి, ఆంధ్రప్రదేశ్‌లో 25 సీట్లు 38కి, కేరళలో 20 సీట్లు 30కి, తెలంగాణలో 17 సీట్లు 26కు పెరిగే అవకాశం ఉంది. అంటే మొత్తం సభలో దక్షిణాది బలం 24 శాతం లోపే ఆగిపోతోంది.
మూడు నార్త్ రాష్ట్రాలకే 223 సీట్లు
మరోవైపు, ఉత్తరాది రాష్ట్రాల సీట్ల పెరుగుదల ఆకాశన్నంటుతోంది. ఉత్తరప్రదేశ్‌లో ప్రస్తుతం ఉన్న 80 సీట్లు ఏకంగా 120కి, బీహార్‌లో 40 సీట్లు 60కి, మధ్యప్రదేశ్‌లో 29 సీట్లు 43 లేదా 44కు చేరుతాయి. అంటే మొత్తం దక్షిణ భారతదేశానికి కలిపి 195 సీట్లు వస్తుంటే.. కేవలం ఈ మూడు హిందీ రాష్ట్రాలకే 223 సీట్లు దక్కుతున్నాయి.
దక్షిణాదితో పనిలేకుండానే ఢిల్లీ పీఠం
రాజస్థాన్ (38), ఛత్తీస్‌గఢ్ (16), జార్ఖండ్ (21), హర్యానా (15), ఉత్తరాఖండ్ (8), హిమాచల్ ప్రదేశ్ (6), ఢిల్లీ (11) సీట్లను కలిపితే కేవలం హిందీ బెల్ట్ నుంచే 338కి పైగా సీట్లు వస్తాయి. వీటికి మహారాష్ట్ర (48 నుంచి 72), గుజరాత్ (39), పశ్చిమ బెంగాల్ (42 నుంచి 63) వంటి రాష్ట్రాలను కలిపితే ఉత్తరాది, ఇతర పెద్ద రాష్ట్రాల బలం 400 మార్కును దాటిపోతోంది. అంటే దక్షిణాది రాష్ట్రాల నుంచి ఒక్క సీటు కూడా గెలవకుండానే ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఏకపక్ష ఆధిపత్యం ఉత్తరాదికి దక్కబోతోంది.
జనాభాను నియంత్రించినందుకు దక్షిణాదికి దక్కే శిక్ష ఇదేనా?
గత నాలుగు దశాబ్దాలుగా కేంద్ర ప్రభుత్వ పిలుపును గౌరవిస్తూ దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణను తూచా తప్పకుండా అమలు చేశాయి. ఫలితంగా ఇక్కడ జనాభా పెరుగుదల అదుపులోకి రావడమే కాకుండా అక్షరాస్యత, వైద్యం, తలసరి ఆదాయం, పారిశ్రామిక వృద్ధిలో దేశానికే ఆదర్శంగా నిలిచాయి. దేశ ఖజానాకు పన్నుల రూపంలో అత్యధిక ఆదాయాన్ని అందిస్తూ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా మారాయి.
కానీ, జనాభా నియంత్రణను పట్టించుకోని ఉత్తరాది రాష్ట్రాలకు ఇప్పుడు విపరీతమైన ఎంపీ సీట్ల రూపంలో బహుమతి దక్కుతుంటే.. ఆదర్శంగా నిలిచిన దక్షిణాది రాష్ట్రాలు తమ రాజకీయ పలుకుబడిని కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ప్రగతి సాధించిన రాష్ట్రాలను ప్రోత్సహించాల్సింది పోయి, వాటి గొంతు నొక్కేలా సీట్ల విభజన ఉండటం సమాఖ్య స్ఫూర్తికే విఘాతమని విశ్లేషకులు మండిపడుతున్నారు.
నిధులు, ప్రాజెక్టుల్లో సౌత్‌కు మొండిచెయ్యి తప్పదా?
ప్రజాస్వామ్యంలో సంఖ్యాబలమే అత్యంత కీలకం. 816 సీట్ల లోక్‌సభలో ఉత్తరాదికి 400కు పైగా సీట్ల ఆధిపత్యం దక్కితే, సహజంగానే జాతీయ పార్టీల దృష్టి అంతా ఆ రాష్ట్రాలపైనే కేంద్రీకృతమవుతుంది. భవిష్యత్తులో కేంద్ర బడ్జెట్ నిధుల కేటాయింపులు, భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, విధానపరమైన నిర్ణయాల్లో ఉత్తరాది రాష్ట్రాలకే పెద్దపీట వేసి, దక్షిణాది ప్రయోజనాలను పూర్తిగా విస్మరించే ప్రమాదం పొంచి ఉంది.
మొత్తానికి, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా సీట్లు పెంచుతున్నామన్న వాదన వెనుక దక్షిణాది రాష్ట్రాల రాజకీయ అస్తిత్వాన్ని బలహీనపరిచే ప్రమాదం దాగి ఉందన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఈ అన్యాయాన్ని సరిదిద్దేలా కేంద్రం ఏదైనా ప్రత్యామ్నాయ మార్గం చూపుతుందా, లేక అంకెల బలంతోనే ముందుకు వెళ్తుందా అన్నది వేచి చూడాలి.
