Adluri Laxman: మంత్రి శ్రీధర్ బాబును టార్గెట్ చేస్తూ పెద్దపల్లి ఎంపీ వంశీ కృష్ణ సీఎస్ కు రాసిన లేఖ కాంగ్రెస్ శ్రేణుల్లో కలకలం రేపుతోంది. ఈ లేఖతో పెద్దపల్లి కాంగ్రెస్ లో మరోసారి అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. తాజాగా ఈ అంశంపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ స్పందించారు. కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంపీ వంశీ కృష్ణ వైఖరిని ఆయన తప్పుపట్టారు. మంత్రి శ్రీధర్ బాబుపై బహిరంగ విమర్శలు సరికాదన్నారు. పెద్దపల్లి పార్లమెంట్ స్థానంలో పెద్ద దిక్కు శ్రీధర్ బాబు అని వ్యాఖ్యానించారు. కష్టకాలంలో కార్యకర్తల కోసం నిలబడింది శ్రీధర్ బాబు అని, అలాంటి వారిపై లేఖలు రాయడం, బహిరంగంగా మాట్లాడటం మంచిది కాదన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్.
సమస్యలుంటే అంతర్గతంగా చర్చించాలి
వంశీకృష్ణ విజయం వెనుక మంత్రి శ్రీధర్ బాబు ఉన్నారని తెలిపారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే అంతర్గతంగా చర్చించాలని సూచించారు. ప్రోటోకాల్ సమస్యలు అధికారుల వల్ల జరుగుతాయన్నారు. అధికారుల తప్పిదాలను శ్రీధర్ బాబు పై రుద్దడం సరికాదన్నారు. ఎంపీ వంశీ కృష్ణ తన తమ్ముడు లాంటివాడన్న అడ్లూరి లక్ష్మణ్.. అంతర్గత విషయాలను బహిరంగంగా మాట్లాడడం వంశీ విజ్ఞతకే వదిలేస్తున్నా అని చెప్పారు.
పెద్దపల్లి కాంగ్రెస్లో శిలాఫలకం చిచ్చు
కాగా, మంథని నియోజకవర్గంలో ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాల భవనాన్ని మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. అయితే, భవనం శిలాఫలకంపై సీఎం రేవంత్, మంత్రుల పేర్లు, ఫోటోలు లేకపోవడంపై ఎంపీ వంశీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది ముఖ్యమంత్రిని, మంత్రులను అగౌరవపరచడమే అని మండిపడ్డారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసిన వంశీకృష్ణ.. 24 గంటల్లో కొత్త శిలాఫలకం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ కార్యక్రమాల ఘనతను ఒక్కరికే ఆపాదించడం సరికాదన్నారు ఎంపీ వంశీ. ప్రోటోకాల్ ఉల్లంఘనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సీఎస్ ను కోరారు. ప్రజాధనం, ప్రభుత్వ సంస్థ.. ఘనత మాత్రం ఒక్కరికే అంటూ లేఖలో రాసిన ఎంపీ వంశీ కృష్ణ.. వెంటనే శిలాఫలకాన్ని సరిదిద్దాలన్నారు.
