Smriti Mandhana: మైదానంలో ప్రత్యర్థి బౌలర్లు ఎంత కఠినమైన సవాల్ విసిరినా, దాన్ని తన బ్యాట్‌తోనే తిప్పికొట్టడం టీమిండియా స్టార్ ఓపెనర్ స్మృతి మంధానకు వెన్నతో పెట్టిన విద్య. తాజాగా ఒక యూట్యూబ్ ఛాలెంజ్‌లో హోస్ట్ విసిరిన సవాల్‌ను స్వీకరించిన స్మృతి, ఏమాత్రం తగ్గకుండా కసితో ఆడి అద్భుతమైన సెంచరీతో సమాధానమిచ్చింది. కేవలం 50 బంతుల్లో 100 పరుగులు చేయాలన్న ఈ ఛాలెంజ్‌లో అడుగడుగునా ఆసక్తికర మలుపులు చోటుచేసుకున్నాయి. 51 మైళ్ల వేగంతో మొదలయ్యే బౌలింగ్ మెషిన్, ప్రతి బంతికి ఒక్కో మైలు స్పీడ్ పెరుగుతూ 100 మైళ్ల (mph) వేగానికి చేరుకుంటుంది. దీనికి తోడు స్మృతిపై ఒత్తిడి పెంచేందుకు హోస్ట్ మరో మెలిక పెట్టాడు.. ఆమె అవుట్ అయితే 5 పరుగులు మైనస్ అవ్వడమే కాకుండా, క్యాచ్ పట్టిన ఫీల్డర్‌కు అక్కడికక్కడే 1,000 డాలర్లు (సుమారు రూ. 84 వేలు) క్యాష్ ప్రైజ్ ఇస్తామని ఆఫర్ ప్రకటించాడు.
డబ్బుల ఆశతో ఫీల్డర్లంతా అలెర్ట్ అవ్వడంతో ఆరంభంలోనే స్మృతికి గట్టి షాక్ తగిలింది. ఒక ఫీల్డర్ గాలిలో ఎగురుతూ ఒంటిచేత్తో అద్భుతమైన క్యాచ్ పట్టడంతో స్మృతి అవుట్ అయింది. దీంతో ఫీల్డర్ వెయ్యి డాలర్లు ఎగరేసుకుపోగా.. "ఇంటర్నేషనల్ మ్యాచ్‌లలో కూడా నా క్యాచ్‌లను ఇలాగే అద్భుతంగా పడతారు" అంటూ స్మృతి నవ్వుతూనే తన ఆటను గేర్ మార్చింది. ఆ తర్వాత బంతి వేగం పెరుగుతున్న కొద్దీ స్మృతి బ్యాట్ నుంచి బౌండరీల వర్షం కురిసింది. కవర్స్ మీదుగా, లెగ్ సైడ్ దిశగా కళ్లు చెదిరే షాట్లు ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది. మధ్యలో ఒక ఫీల్డర్ క్యాచ్ వదిలేయడంతో.. "క్యాచ్ డ్రాప్ చేయడానికి వాళ్లకు నేను 2,000 డాలర్లు ఇచ్చాను" అంటూ స్మృతి వేసిన పంచ్ అక్కడున్న వారందరినీ కడుపుబ్బా నవ్వించింది.
78 మైళ్ల వేగం దాటితే ఆడటం తనకు కాస్త కష్టమవుతుందని స్మృతి ముందే చెప్పడంతో, ఎలాగైనా ఆమెను కట్టడి చేయాలని హోస్ట్ బౌలింగ్ మెషిన్ వేగాన్ని 80 మైళ్లకు పెంచాడు. 'ఈ వేగాన్ని ఎదుర్కొని సిక్సర్లు కొట్టగలవా?' అన్నట్లుగా హోస్ట్ సవాల్ విసరడంతో, స్మృతి మరింత కసితో రెచ్చిపోయింది. ఏకంగా 80 మైళ్ల వేగంతో బుల్లెట్లా దూసుకొచ్చిన బంతిని చూసి ఏమాత్రం బెదరకుండా భారీ సిక్సర్‌గా మలిచి హోస్ట్ నోరు మూయించింది.
ఇక 90 రన్స్లోకి అడుగుపెట్టాక తనకున్న 'నెర్వస్ నైంటీస్' భయాన్ని గుర్తు చేసుకుంటూ, గతంలో లార్డ్స్ మైదానంలో ఇలాగే 90లలో భారీ స్కోర్లు చేజార్చుకున్న విషయాన్ని ప్రస్తావించింది.
ఈసారి మాత్రం ఆ పొరపాటు జరగనివ్వకూడదని స్మృతి గట్టిగా ఫిక్స్ అయింది. 99 పరుగుల వద్ద స్మృతిని ఎలాగైనా ఆపాలని హోస్ట్ స్వయంగా ఫీల్డింగ్‌కు దిగి, బౌలింగ్ మెషిన్ వేగాన్ని ఏకంగా 87 మైళ్లకు పెంచాడు. అయినా సరే స్మృతి ఏమాత్రం తడబడకుండా బంతిని గ్యాప్‌లోకి పంపి అలవోకగా సెంచరీ పూర్తి చేసుకుంది. ప్రత్యర్థి విసిరిన ప్రతి సవాల్‌ను దాటుకుంటూ సెంచరీ బాదిన స్మృతి, ఆ తర్వాత తనదైన స్టైల్లో స్పెషల్ సెలబ్రేషన్ చేసుకోవడం ఈ హైలైట్‌గా నిలిచింది.
