తెలంగాణ

Telangana BJP: కంచుకోటలు వదిలి వీక్ ఏరియాలపై కన్ను.. తెలంగాణ బీజేపీ యాక్షన్ ప్లాన్ ఇదే!

Telangana BJP: తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా అధికారం దక్కించుకోవాలనే పట్టుదలతో ఉన్న బీజేపీ అధిష్ఠానం, రాష్ట్ర నేతల పనితీరుపై సీరియస్‌గా దృష్టి సారించింది. ఇన్నాళ్లూ పార్టీకి పట్టున్న ప్రాంతాల్లోనే సభలు, సమావేశాలు పెడుతూ హడావుడి చేసిన నేతలకు ఢిల్లీ పెద్దలు తాజాగా స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.

Telangana BJP: తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా అధికారం దక్కించుకోవాలనే పట్టుదలతో ఉన్న బీజేపీ అధిష్ఠానం, రాష్ట్ర నేతల పనితీరుపై సీరియస్‌గా దృష్టి సారించింది. ఇన్నాళ్లూ పార్టీకి పట్టున్న ప్రాంతాల్లోనే సభలు, సమావేశాలు పెడుతూ హడావుడి చేసిన నేతలకు ఢిల్లీ పెద్దలు తాజాగా స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్, కరీంనగర్ లాంటి కంచుకోటలను కాసేపు పక్కనపెట్టి.. పార్టీ అత్యంత బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో సత్తా చాటాలని ఆదేశించారు. దీంతో తెలంగాణ బీజేపీ ఇప్పుడు తన రూట్ మార్చి, వీక్ ఏరియాలను టార్గెట్ చేస్తూ కొత్త యాక్షన్ ప్లాన్‌తో రంగంలోకి దిగుతున్నట్లు కనిపిస్తోంది.

ఆ మూడు జిల్లాలు గెలవకపోతే అధికారం కష్టమే!

గత లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని ఉత్తర, మధ్య తెలంగాణ ప్రాంతాల్లో బీజేపీ అద్భుతమైన ఫలితాలు సాధించింది. కానీ, ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల పరిధిలోని చాలా నియోజకవర్గాల్లో కమలం పార్టీ కనీసం డిపాజిట్ల కోసం పోరాడాల్సిన పరిస్థితి ఎదురైంది. ఈ మూడు కీలక జిల్లాలను వదిలేసి, మిగతా చోట్ల ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి నీటి మీద రాతల్లాగే మిగిలిపోతాయని ఢిల్లీ పెద్దలు గట్టిగా భావిస్తున్నారు. కేవలం నాయకులు అనుకుంటే సరిపోదని, రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందనే నమ్మకం సామాన్య ప్రజల్లో కలగాలంటే ఈ మూడు జిల్లాల్లో బలపడటం తప్పనిసరని అధిష్ఠానం తేల్చిచెప్పింది.

వారం పాటు ఖమ్మంలోనే ఎంపీలు, ఎమ్మెల్యేల మకాం!

హైకమాండ్ ఆదేశాలతో రాష్ట్ర నాయకత్వం వెంటనే కసరత్తు మొదలుపెట్టింది. ముఖ్యంగా పార్టీకి అత్యంత బలహీనంగా ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచే ఈ ప్రత్యేక ఆపరేషన్‌కు శ్రీకారం చుట్టబోతున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలందరూ త్వరలోనే ఒక వారం రోజుల పాటు ఖమ్మం జిల్లాలోనే మకాం వేయనున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ, స్థానిక సమస్యలపై పోరాడుతూ ప్రజలకు చేరువయ్యేలా ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేశారు.

మహా పాదయాత్రల రూట్ మారింది..

'ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం - అరాచకాన్ని అణచివేద్దాం' అనే నినాదంతో ఇటీవల హైదరాబాద్, కరీంనగర్‌లలో బీజేపీ నిర్వహించిన మహా పాదయాత్రలకు జనం నుంచి మంచి స్పందన వచ్చింది. అయితే, బలమున్న చోట యాత్రలు చేస్తే వచ్చే మైలేజీ కంటే, బలం లేని చోట పార్టీని నిలబెట్టడమే అసలైన సవాల్ అని నాయకత్వం గుర్తించింది. అందుకే తదుపరి మహా పాదయాత్రలను ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కంచుకోటలు దాటి కొత్త ప్రాంతాల్లో పాగా వేయాలన్న ఢిల్లీ పెద్దల ఈ కొత్త వ్యూహం తెలంగాణ రాజకీయాల్లో కాషాయ దళానికి ఏ మేరకు కలిసొస్తుందో చూడాలి.

తర్వాత చదవండి