* గ్రామాభివృద్ధికి సహకారం ప్రశంసనీయం
* యువత, మహిళలు శిక్షణ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలి
* రాష్ట్ర పంచాయతీరాజ్, మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క
Seethakka: నడిగడ్డలోని సురవరం కుటుంబానికి జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు ఉన్నాయని, కంచుపాడు గ్రామంలో వారి కుటుంబ సభ్యుల సేవా కార్యక్రమాలు ప్రశంసనీయమని రాష్ట్ర పంచాయతీరాజ్, మహిళా, శిశు సంక్షేమ, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి సీతక్క అన్నారు. శుక్రవారం జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం కంచుపాడు గ్రామంలో అభివృద్ధి పనులకు మంత్రి సీతక్క శంకుస్థాపనలు చేశారు.
44వ జాతీయ రహదారి నుంచి కంచుపాడుకు రూ.3 కోట్ల నిధులతో నిర్మించనున్న బీటీ రహదారికి, విబి జీరాంజీ పథకంలో భాగంగా రూ.30.22 కోట్ల నిధులతో అలంపూర్ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో చేపట్టే 323 పనులకు శంకుస్థాపనలు చేశారు. పశు సంవర్ధక, మత్స్యశాఖల మంత్రి వాకిటి శ్రీహరి, ఎంపీ మల్లు రవి, అలంపూర్ ఎమ్మెల్యే విజేయుడు ఇందులో పాల్గొన్నారు.
అనంతరం గ్రామంలోని సురవరం వెంకట్రామిరెడ్డి విజ్ఞాన కేంద్రాన్ని ప్రజాప్రతినిధులు సందర్శించారు. ఇక్కడి సురవరం సుధాకర్ రెడ్డి హాల్, గ్రంథాలయం, క్రీడ, నైపుణ్య అభివృద్ధి శిక్షణ విభాగాలను పరిశీలించారు. సేవా కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు. విజ్ఞాన కేంద్రంలో యువతకు వివిధ క్రీడల్లో శిక్షణ ఇవ్వడమే కాక మహిళలకు రామనంద తీర్థ ట్రస్ట్ సహకారంతో టైలరింగ్, ఇతర ఉపాధి రంగాల్లో రాణించేందుకు తర్ఫీదు ఇవ్వడం అభినందనీయమని ప్రజాప్రతినిధులు అన్నారు. గ్రంథాలయాన్ని కూడా విద్యార్థులు, నిరుద్యోగులు, గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
