* మహిళల ఆత్మగౌరవానికి ప్రతీకగా ఇందిరమ్మ చీరలు
* మహిళల సంక్షేమానికి కృషి చేస్తున్న ప్రభుత్వం
* వడ్డీ లేని రుణాలతో మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు తోడ్పాటు
* బాల్య వివాహాల నిర్మూలనకు కలిసికట్టుగా పనిచేయాలి
* పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి సీతక్క
* ఐజలో చేయూత పెన్షన్లు, బీమా పథకం, ఇందిరమ్మ చీరల పంపిణీ
Seethakka: మహిళల ఆత్మగౌరవానికి ఇందిరమ్మ చీరలు ప్రతీకగా నిలుస్తాయని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్, మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క అన్నారు. వడ్డీ లేని రుణాలతో ఆడపడుచులు ఆర్థికంగా ఎదిగేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. శుక్రవారం గద్వాల జిల్లా ఐజ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్ లో ఇందిర మహిళా శక్తి ప్రభుత్వ సంక్షేమ పథకాల సంబరాల పేరుతో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు మంత్రి సీతక్క.
ఒక్కో సంఘానికి రూ.10 లక్షలు
ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జోగులాంబ గద్వాల జిల్లాలో రూ.212 కోట్ల వడ్డీ లేని రుణాలను మహిళా సంఘాలకు ఇచ్చామన్నారు. మహిళా సంఘాల సభ్యులు సమావేశాలు నిర్వహించుకునేందుకు ప్రతి గ్రామంలో గ్రామ సమాఖ్య భవనాల నిర్మాణం పెద్దఎత్తున చేపట్టామన్నారు. మహిళలకు ఒక్కో సంఘానికి గరిష్టంగా రూ.10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలను మంజూరు చేయడంతో వివిధ వ్యాపారాలు, వృత్తులు చేసుకుంటూ ఆర్థికంగా ఎదుగుతున్నారని వెల్లడించారు.
మహిళలకు బస్సులు ఇవ్వడమే కాక సోలార్ ప్లాంట్లు, పెట్రోల్ బంకులు నిర్వహించుకునేందుకు సహకారం అందిస్తున్నామన్నారు మంత్రి సీతక్క. కరువు పరిస్థితుల్లో వలసపోయే పరిస్థితి రాకుండా గ్రామాల్లోనే వివిధ పనులు చేసుకునేందుకు వీబీ జీ రాంజీ పథకంలో ప్రభుత్వం అవకాశం కల్పిస్తోందన్నారు. మహిళల పేరిటే ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు ఇస్తున్నట్లు వెల్లడించారు. బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరు సహకరించాలని, అమ్మాయిలను బాగా చదివిస్తే జీవితంలో స్థిరపడతారని మంత్రి సీతక్క చెప్పారు.
ఈ నెల 26న అచ్చంపేటలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించారని ఎంపీ మల్లు రవి తెలిపారు. ఆడపిల్లలు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం పెద్దఎత్తున రుణాలను అందించి సహకరిస్తోందన్నారు. జిల్లాలో 9వేల మందికి చేయూత పెన్షన్లు మంజూరు చేశామన్నారు. బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిందని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి అర్హులైన వారంతా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పెద్దఎత్తున అర్హులైన వారికి చేయూత పెన్షన్లు మంజూరు చేశామన్నారు.
మహిళలు ఆర్థికంగా ఎదగాలన్న సంకల్పం
మహిళలు ఆర్థికంగా ఎదిగి సంతోషంగా ఉండాలనే సంకల్పంతో ప్రభుత్వం పెద్దఎత్తున వడ్డీలేని రుణాలను మహిళా సంఘాలకు ఇస్తోందని రాష్ట్ర గొర్రెలు, మేకలు అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్సన్ సరిత అన్నారు. సీఎం రేవంత్ అన్నగా పుట్టింటి కానుకగా ఆడపడుచులందరికీ ఇందిరమ్మ చీరలను పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని చెప్పారు. మహిళలు సంతోషంగా ఉంటే, ఆ కుటుంబాలు సుభిక్షంగా ఉంటాయన్నారు.
ఈ కార్యక్రమంలో మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. పలు మహిళా సంఘాలకు రూ.15.89 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలకు సంబంధించిన చెక్కును ప్రజా ప్రతినిధులు అందజేశారు. బాల్య వివాహ్ ముక్త్ భారత్ అభియాన్ పై ముద్రించిన వాల్ పోస్టర్లు విడుదల చేశారు. బాల్య వివాహాల నిర్మూలనకు కృషి చేసిన ఐదుగురికి జ్ఞాపికలు ఇచ్చారు. ఇక, చేయూత పెన్షన్ల లబ్దిదారులకు మంజూరు పత్రాలను అందించారు.
