తెలంగాణ

TG: మత్స్యకారుల పొట్టకొట్టొద్దు.. కలెక్టర్లకు మంత్రి వాకిటి శ్రీహరి 10 రోజుల డెడ్‌లైన్!

TG: వాతావరణ మార్పులు, 'ఎల్‌నినో' ప్రభావం కారణంగా చెరువులు, జలాశయాల్లో నీరు తగ్గిపోయి మత్స్యకారుల పొట్టకొట్టే పరిస్థితి రాకూడదని తెలంగాణ ప్రభుత్వం గట్టి నిర్ణయం తీసుకుంది. నీటి నిల్వలు అడుగంటితే చేపల పెంపకంపై ఆధారపడి బతికే లక్షలాది కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉండటంతో మంత్రి వాకిటి శ్రీహరి తక్షణమే రంగంలోకి దిగారు.

TG: వాతావరణ మార్పులు, 'ఎల్‌నినో' ప్రభావం కారణంగా చెరువులు, జలాశయాల్లో నీరు తగ్గిపోయి మత్స్యకారుల పొట్టకొట్టే పరిస్థితి రాకూడదని తెలంగాణ ప్రభుత్వం గట్టి నిర్ణయం తీసుకుంది. నీటి నిల్వలు అడుగంటితే చేపల పెంపకంపై ఆధారపడి బతికే లక్షలాది కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉండటంతో మంత్రి వాకిటి శ్రీహరి తక్షణమే రంగంలోకి దిగారు. గచ్చిబౌలి స్టేడియం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన.. మత్స్యకారుల ఉపాధికి ఎలాంటి నష్టం కలగకుండా వారం నుంచి పది రోజుల్లోగా క్షేత్రస్థాయిలో పనులు పూర్తి చేయాలని కలెక్టర్లకు స్పష్టమైన డెడ్‌లైన్ విధించారు.

ఎల్‌నినో దెబ్బకు చెరువులు ఎండకముందే యాక్షన్ ప్లాన్

ఎల్‌నినో ప్రభావంతో రాబోయే రోజుల్లో వాతావరణం ప్రతికూలంగా మారి, నీటి వనరులు వేగంగా ఆవిరయ్యే ప్రమాదం ఉందని మంత్రి వాకిటి శ్రీహరి అధికారులను అప్రమత్తం చేశారు. పరిస్థితి చేయి దాటకముందే నీటిపారుదల, మత్స్యశాఖ అధికారులు సమన్వయంతో రంగంలోకి దిగాలని ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రతి చెరువు, జలాశయంలో ప్రస్తుతం ఎంత నీరుంది? వచ్చే ఏడు నెలల్లో ఎండలకు ఎంత నీరు ఇంకిపోయే అవకాశం ఉంది? చివరకు చేపల పెంపకానికి అనుకూలంగా ఉండే నీటి నిల్వలు ఎక్కడెక్కడ ఉన్నాయి? అనే దానిపై పక్కాగా లెక్కలు తేల్చాలని కలెక్టర్లకు తేల్చి చెప్పారు.

నీళ్లున్న చెరువుల్లో వెంటనే చేప పిల్లల విడుదల

మత్స్యకారుల ఆదాయానికి గండి పడకుండా ఉండేందుకు తగినంత నీటి నిల్వలు ఉన్న చెరువులు, జలాశయాల జాబితాను వెంటనే మత్స్యశాఖకు పంపాలని మంత్రి సూచించారు. నీటి లభ్యత ఉన్న ప్రతి చోటా వెంటనే చేప పిల్లలను విడుదల చేసేందుకు ప్రభుత్వం పూర్తి సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల ఏ ఒక్క మత్స్యకార కుటుంబానికి కూడా ఉపాధి దెబ్బతినకూడదని, పది రోజుల్లోగా ఈ ప్రక్రియంతా కొలిక్కి రావాలని ఆదేశించారు. ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా మత్స్యకారుల జీవనోపాధిని కాపాడేందుకు తమ ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుందని వాకిటి శ్రీహరి భరోసా ఇచ్చారు.

తర్వాత చదవండి