Human Egg: హైదరాబాద్‌లో సంచలనం రేపిన అక్రమ అండాల సేకరణ కేసులో మల్కాజిగిరి పోలీసులు (Malkajgiri Police) దర్యాప్తును వేగవంతం చేశారు. ఒయాసిస్ ఫెర్టిలిటీ కేంద్రాల (Oasis Fertility Center) పేరుతో జరుగుతున్న అక్రమ అండాల సేకరణ (Illegal Human Egg Collection) వ్యవహారంలో సద్గురు హెల్త్‌కేర్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన ఇద్దరు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు.
కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ప్రతిక్ (COO) అనిల్ గగ్లానీ, మెడికల్ అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ రాజర్షి దేబ్‌లను అదుపులోకి తీసుకున్నారు. సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన క్రైమ్ నంబర్ 1145/2026 కేసు దర్యాప్తులో భాగంగా ఈ అరెస్టులు జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. ఇప్పటికే ఈ కేసులో దుర్గా ప్రసాద్, అమిత్, నికత్ పర్వీన్ ని పోలీసులు అరెస్ట్ చేశారు.
దేశవ్యాప్తంగా మహిళల సమీకరణ?
పోలీసుల దర్యాప్తు ప్రకారం.. అండాల సేకరణ కోసం దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి మహిళలను ఏజెంట్ల ద్వారా సమీకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. మియాపూర్‌లోని సద్గురు ART బ్యాంక్ ఇన్‌చార్జ్ సునీల్ రాయ్, కంపెనీ యాజమాన్యం సూచనల మేరకు ఈ వ్యవహారాన్ని నిర్వహించినట్లు పోలీసులు పేర్కొన్నారు. అండాల ఉత్పత్తిని ప్రేరేపించేందుకు మహిళలకు ప్రత్యేక ఇంజెక్షన్లు ఇచ్చి, అనంతరం IVF కేంద్రాలకు తరలించినట్లు దర్యాప్తులో వెల్లడైందని తెలిపారు.
నెలకు రూ.28 కోట్ల ఆదాయం?
దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న 43 క్లినిక్స్ లో ప్రతి నెల సుమారు 600 సెల్ఫ్ సైకిల్స్, 100 వరకు ఓసైట్ (Oocyte) డోనర్ సైకిల్స్ జరుగుతున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ కార్యకలాపాల ద్వారా నెలకు 28 కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నట్లు పేర్కొన్నారు.
కీలకంగా మారిన బ్యాంకు లావాదేవీలు
సద్గురు హెల్త్‌కేర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు (Sadguru Healthcare Services) చెందిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఖాతాను పరిశీలించిన పోలీసులు.. 2026 ఏప్రిల్ 1 నుంచి నవంబర్ 26 వరకు భారీ మొత్తంలో డెబిట్, క్రెడిట్ లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. వీటి మొత్తం విలువ రూ.2,487కోట్లుగా పేర్కొన్నారు.
అధికారుల పాత్రపై ఆరోపణలు
COO ప్రతిక్ గగ్లానీ కంపెనీ కార్యకలాపాల నిర్వహణ, వైద్య పరికరాల కొనుగోలు, నిధుల సమన్వయంలో కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు మెడికల్ అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ రాజర్షి దేబ్ క్లినికల్ కార్యకలాపాలు, వైద్యుల నియామకాలు, ఆపరేషన్ థియేటర్ల నిర్వహణను పర్యవేక్షించినట్లు వెల్లడించారు. ఈ వ్యవహారంలో ఇద్దరు అధికారులు నెలకు రూ.4.20 లక్షలు, రూ.3.60 లక్షల జీతాలు పొందుతున్నట్లు తెలిపారు.
మొబైల్ ఫోన్లు స్వాధీనం
నిందితుల నుంచి మూడు ఐఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డిజిటల్ ఆధారాలను విశ్లేషించి, ఈ నెట్‌వర్క్‌లో ఉన్న ఇతర వ్యక్తుల పాత్రను వెలికితీసేందుకు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అనధికార అండాల సేకరణ, రవాణ, సహాయక పునరుత్పత్తి సాంకేతికత నిబంధనల ఉల్లంఘనకు సంబంధించిన పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
