Dasoju Sravan: ఇంటర్మీడియట్ రద్దుపై సీఎం రేవంత్ రెడ్డికి లేఖ సంధించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్. తెలంగాణ విద్యార్థుల స్థానికత హక్కులు కాలరాయొద్దని లేఖలో కోరారు. స్వార్థపూరిత ఇంటర్మీడియట్ రద్దు నిర్ణయాన్ని నిలిపివేయాలని సీఎం రేవంత్ కి విజ్ఞప్తి చేశారు ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్. ఇంటర్మీడియట్ను రద్దు చేసి 9 నుండి 12వ తరగతి వరకు ఒకే బడిగా మారిస్తే తెలంగాణ విద్యార్థుల స్థానికతపై రేవంత్ ప్రభుత్వం దాడి చేసినట్లే అని ఆరోపించారు.
మెడికల్, ఇంజనీరింగ్ సీట్లు తన్నుకుపోయే ప్రమాదం
నాలుగేళ్ల కార్పొరేట్ హాస్టల్ ప్యాకేజీ కొంటే ఇతర రాష్ట్రాల విద్యార్థులు సైతం చట్టబద్ధంగా 'తెలంగాణ లోకల్' అయిపోయి, మన బిడ్డల మెడికల్, ఇంజనీరింగ్ సీట్లు తన్నుకుపోయే ప్రమాదం ఉందని దాసోజు శ్రవణ్ హెచ్చరించారు. లోకల్ హోదా పుట్టుకతో కాకుండా ప్రవేశ పరీక్షకు ముందు వరుసగా నాలుగేళ్లు ఎక్కడ చదివారనే దానిపైనే ఆధారపడి ఉంటుందని లేఖలో స్పష్టం చేశారాయన.
తెలంగాణ విద్యార్థుల భవిష్యత్తును శాశ్వతంగా దెబ్బతీసే చర్య
తెలంగాణ విద్యార్థుల భవిష్యత్తును శాశ్వతంగా దెబ్బతీసే ఈ చట్టపరమైన ఇంటర్మీడియట్ రద్దు ప్రమాదాన్ని నివారించాలని సీఎం రేవంత్ ను శ్రవణ్ కోరారు. ప్రజాప్రతినిధులు, విద్యావేత్తలు, తల్లిదండ్రులతో కనీస చర్చ లేకుండా తీసుకున్న ఇంటర్మీడియట్ రద్దు నిర్ణయం వెనుక కార్పొరేట్ కాలేజీల ప్రయోజనాలున్నాయని ఆరోపించారు. తాను నవంబర్ 13న రాసిన బహిరంగ లేఖపై వారం గడిచినా ప్రభుత్వం నుండి ఒక్క సమాధానం కూడా రాలేదని, కార్పొరేట్ సంస్థలకు లాభం చేకూర్చే ఇంటర్ రద్దు నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
