ఆరోగ్యం

Health Tips : నిత్యం ఏయే హెల్త్ చెకప్స్ ముఖ్యం.. నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుందంటే?

కొందరు చాలా యాక్టివ్‌గా ఉంటారు.కానీ ఉన్నట్టుండి అనారోగ్య సమస్యలకు గురవుతుంటారు. ప్రాబ్లమ్ మీదకు వచ్చేంతవరకు వారి శరీరంలో ఏం జరుగుతుందో వారికి తెలియదు. అందుకే ప్రతి ఆరు నెలలకు ఒకసారి రక్తపరీక్షలు చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.ఏదైనా పెద్ద సమస్య వచ్చేవరకు చాలా వ్యాధులు బయటకు లక్షణాలను చూపించవు.

కొందరు చాలా యాక్టివ్‌గా ఉంటారు.కానీ ఉన్నట్టుండి అనారోగ్య సమస్యలకు గురవుతుంటారు. ప్రాబ్లమ్ మీదకు వచ్చేంతవరకు వారి శరీరంలో ఏం జరుగుతుందో వారికి తెలియదు. అందుకే ప్రతి ఆరు నెలలకు ఒకసారి రక్తపరీక్షలు చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.ఏదైనా పెద్ద సమస్య వచ్చేవరకు చాలా వ్యాధులు బయటకు లక్షణాలను చూపించవు. అందుకే వాటిని "సైలెంట్ కిల్లర్స్" అని పిలుస్తుంటారు. వ్యాధులు ముదరకముందే గుర్తించడానికి క్రమం తప్పకుండా హెల్త్ చెకప్స్ అవసరం. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకం కావొచ్చు.

రక్తపోటు (బీపీ)

బీపీ పరీక్ష తప్పకుండా చేయించుకోవాలి. 25 సంవత్సరాలు పైబడిన వారు శరీరంలో రక్త ప్రసరణ వేగం సరిగ్గా ఉందో చెక్ చేసుకోవడానికి ఈ టెస్టు ఎంతో ఉపయోగపడుతుంది. నిర్లక్ష్యం చేయడం మూలంగా అధిక రక్తపోటు (High BP) రావొచ్చు. చాలా వరకు ఎలాంటి లక్షణాలు లేకుండానే పెరుగుతుంది. దీనిని గుర్తించకపోతే గుండెపోటు (Heart Attack), పక్షవాతం (Stroke), కిడ్నీ వైఫల్యం సంభవించే ప్రమాదం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

రక్తంలో చక్కెర స్థాయిలు

రక్తంలో చెక్కర స్థాయిలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం.మధుమేహం (Diabetes) ఉందా? ప్రీ-డయాబెటిస్ దశలో ఉన్నామా? తెలుసుకోవడానికి ఈ పరీక్షలు చాలా ముఖ్యం. HbA1c టెస్టు చేయించుకుంటే గత 3 నెలల సగటు షుగర్ స్థాయిని చూపిస్తుంది. రాండమ్ షుగర్ టెస్టు ద్వారా కూడా రక్తంలో చక్కెర లెవల్స్ ఎలా ఉన్నాయో తెలుస్తుంది. షుగర్ నియంత్రణలో లేకపోతే కంటి చూపు దెబ్బతినడం (Retinopathy), కిడ్నీలు పాడవడం, నరాల బలహీనత (కాళ్లు తిమ్మిర్లు ఎక్కడం), గాయాలు త్వరగా మానకపోవడం వంటి తీవ్ర సమస్యలు వస్తాయి.

లిపిడ్ ప్రొఫైల్ (కొలెస్ట్రాల్ పరీక్ష)

శరీరంలో మంచి కొలెస్ట్రాల్ (HDL), చెడు కొలెస్ట్రాల్ (LDL), ట్రైగ్లిజరైడ్స్ (Triglycerides) స్థాయిలను తెలుసుకోవడానికి ఈ పరీక్ష ఉపయోగపడుతుంది. రక్తంలో కొలెస్ట్రాల్ నియంత్రణలో లేకపోతే రక్తనాళాల్లో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోయి రక్త ప్రసరణకు అడ్డుపడుతుంది. ఇది చిన్న వయసులోనే గుండెపోటు రావడానికి ప్రధాన కారణమవుతుంది.అందుకే ప్రతి ఆరు నెలలకు ఒకసారి లిపిడ్ ప్రొఫైట్ టెస్టు చేయించుకోవడం చాలా బెటర్.

కంప్లీట్ బ్లడ్ పిక్చర్ (CBP / CBC)

శరీరంలో హిమోగ్లోబిన్ (రక్తం), తెల్ల రక్త కణాలు (రోగనిరోధక శక్తి), ప్లేట్‌లెట్ల సంఖ్యను తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. తరచూ చెక్ చేసుకోకపోతే రక్తహీనత (Anemia), శరీరంలో దాగి ఉన్న ఇన్ఫెక్షన్లు, తీవ్రమైన అలసట వంటి వాటిని గుర్తించలేము. అందుకే రక్తపరీక్షల విషయంలో నిర్లక్ష్యం పనికిరాదు.

కాలేయం, కిడ్నీల పనితీరు పరీక్షలు (LFT & KFT)

మన శరీరంలోని వ్యర్థాలను వడపోసే కిడ్నీలు, ఆహారాన్ని జీర్ణం చేసి విషపదార్థాలను తొలగించే కాలేయం ఆరోగ్యంగా ఉన్నాయా? లేదా తెలుసుకోవడానికి ఈ టెస్టు చాలా ముఖ్యమైనది. లేదంటే ఫ్యాటీ లివర్ (Fatty Liver) వంటి సమస్యలు ముదిరి లివర్ సిర్రోసిస్‌కు దారితీయవచ్చు. అలాగే కిడ్నీలు 70-80% దెబ్బతినే వరకు లక్షణాలు కనిపించవు. అందుకే నిర్లక్ష్యం చేయకూడదని వైద్యులు సూచిస్తున్నారు.

థైరాయిడ్ ప్రొఫైల్ :

శరీర జీవక్రియలను (Metabolism) నియంత్రించే థైరాయిడ్ గ్రంథి పనితీరును తెలుసుకోవడానికి (ముఖ్యంగా మహిళలకు ఈ టెస్టు చాలా అవసరం)నిర్లక్ష్యం చేయడం వలన అకారణంగా బరువు పెరగడం లేదా తగ్గడం, తీవ్రమైన నీరసం, జుట్టు రాలడం, మానసిక ఒత్తిడి, మహిళల్లో నెలసరి సమస్యలు ఏర్పడతాయి.

విటమిన్ D, విటమిన్ B12 టెస్టులు..

ఎముకల బలానికి విటమిన్ D, నరాలు, మెదడు పనితీరుకు విటమిన్ B12 అత్యవసరం.శరీరంలో డీ విటమిన్, బీ12 తగ్గితే కీళ్ల నొప్పులు, ఎముకలు బలహీనపడటం, మతిమరుపు, నిస్సత్తువ, చేతులు-కాళ్లలో సూదులతో గుచ్చినట్లు నొప్పి రావడం వంటివి జరుగుతాయి. అందుకే ఈ విషయంలోనూ నిర్లక్ష్యం అస్సలే పనికిరాదు.

గుండె, ఇతర ప్రత్యేక పరీక్షలు

35-40 ఏళ్లు దాటిన వారు ఆరు నెలలకొసారి ECG / 2D Echo / TMT టెస్టులు చేయించుకోవాలి. గుండె పనితీరు, రక్త ప్రసరణలో ఏవైనా లోపాలు ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి ఈ టెస్టులు చాలా ఉపయోగపడతాయి. అదేవిధంగా కంటి, దంత పరీక్షలు ఏడాదికి ఒకసారి చేయించుకోవాలి. కంటి చూపు, గ్లాకోమా పరీక్షలు, దంత పరీక్షలు చాలా కీలకం.

తర్వాత చదవండి