తెలంగాణ

TG: చిరిగిపోదు, తడిసినా పాడవదు.. తెలంగాణలో ఇక హైటెక్ పాస్ పుస్తకాలు!

TG: ఇన్నాళ్లూ వర్షంలో తడిసినా, ఇంట్లో భద్రంగా దాచుకోకపోయినా పాస్ పుస్తకాలు చిరిగిపోయి రైతులు నానా అవస్థలు పడేవారు. కానీ ఇకపై ఆ బాధలకు శాశ్వతంగా చెక్ పడబోతోంది. తెలంగాణ ప్రభుత్వం రైతులకు, భూ యజమానులకు ఉచితంగా ‘వాటర్‌ప్రూఫ్’ హైటెక్ పాస్ పుస్తకాలను ఇవ్వబోతోంది. శుక్రవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడిన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

TG: ఇన్నాళ్లూ వర్షంలో తడిసినా, ఇంట్లో భద్రంగా దాచుకోకపోయినా పాస్ పుస్తకాలు చిరిగిపోయి రైతులు నానా అవస్థలు పడేవారు. కానీ ఇకపై ఆ బాధలకు శాశ్వతంగా చెక్ పడబోతోంది. తెలంగాణ ప్రభుత్వం రైతులకు, భూ యజమానులకు ఉచితంగా ‘వాటర్‌ప్రూఫ్’ హైటెక్ పాస్ పుస్తకాలను ఇవ్వబోతోంది. శుక్రవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడిన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. రానున్న ఏడాదిన్నరలో రాష్ట్రంలోని ప్రతి అంగుళం భూమిని కొలిచి, భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని ఆయన ప్రకటించారు.

ఒక్క స్కాన్‌తో భూమి చిట్టా అంతా మీ ఫోన్‌లోనే

కొత్తగా ఇవ్వబోయే పాస్ పుస్తకాలు ఎంత వానలో తడిసినా పాడవకుండా, అస్సలు చిరిగిపోని విధంగా వాటర్‌ప్రూఫ్ టెక్నాలజీతో తయారు చేస్తున్నారు. వీటిపై ఉండే క్యూఆర్ కోడ్‌ను మీ మొబైల్‌తో స్కాన్ చేస్తే చాలు.. ఆ భూమి సర్వే నంబర్, విస్తీర్ణం, మ్యాప్ వివరాలన్నీ క్షణాల్లో స్క్రీన్ మీద ప్రత్యక్షమవుతాయి. అంతేకాదు, ఒకే వ్యక్తికి వేర్వేరు చోట్ల భూములు ఉంటే, వాటన్నింటి వివరాలను ఒకే పాస్ పుస్తకంలో వేర్వేరు పేజీల్లో పొందుపరుస్తారు.

ఇంటి స్థలాలకూ రెండు రంగుల్లో పాస్ పుస్తకాలు

ఇప్పటి వరకు కేవలం పొలాలకు మాత్రమే పాస్ పుస్తకాలు ఉండేవి. కానీ ఇకపై గ్రామాల్లోని ఇళ్లు, ఖాళీ స్థలాలు (ఆబాదీ ఆస్తులు) కూడా సర్వే చేసి మ్యాప్‌తో కూడిన పక్కా డాక్యుమెంట్లు ఇవ్వనున్నారు. అది 100 గజాల స్థలమైనా, 500 గజాల స్థలమైనా సరే రికార్డుల్లోకి ఎక్కుతుంది. పొలాలకు ఒక రంగు, ఇంటి స్థలాలకు మరో రంగులో వేర్వేరు పాస్ పుస్తకాలను ప్రభుత్వం జారీ చేయనుంది.

ఏడాదిన్నరలో సర్వే పూర్తి..

మొదటి విడతలో అసలు నక్షా (మ్యాప్) లేని 373 గ్రామాల్లో జరుగుతున్న సర్వేను ఈ డిసెంబర్ చివరి నాటికి పూర్తి చేస్తారు. పనులు స్పీడ్‌గా జరగడానికి మండలానికి ఉన్న సర్వే టీమ్‌లను ఒకటి నుంచి రెండుకు పెంచారు. సర్వేకు ముందే ఊర్లో చాటింపు వేసి అందరికీ సమాచారం ఇస్తారు. కొలతల్లో తేడాలు, సరిహద్దు గొడవలు వస్తే కలెక్టర్లు, ఆర్డీఓలు నేరుగా రంగంలోకి దిగి ఇరు వర్గాలకు న్యాయం జరిగేలా పరిష్కరిస్తారు.

బీజేపీ, బీఆర్ఎస్‌లపై పొంగులేటి సెటైర్లు

భూ సర్వే వివరాలతో పాటు రాజకీయంగానూ మంత్రి పొంగులేటి ప్రత్యర్థులపై గట్టిగానే విరుచుకుపడ్డారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణపై సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని మండిపడ్డారు. రాష్ట్రం 13 లక్షల ఇళ్లు అడిగితే కేవలం 2 లక్షలే ఇచ్చిందని, కానీ పక్కనున్న ఏపీకి మాత్రం మొన్న 4 లక్షలు, గతంలో జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఏకంగా 17 లక్షల ఇళ్లు మంజూరు చేసిందని గుర్తుచేశారు. ఇక మళ్లీ అధికారంలోకి వస్తామని బీఆర్ఎస్ నేతలు పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేసిన ఆయన, తమ ప్రభుత్వానికి ఎవరిపైనా కక్ష సాధింపు చర్యలు లేవని, ఏ పని చేసినా నిజాయితీగా చేస్తామని స్పష్టం చేశారు.

తర్వాత చదవండి