Kukatpally Truck Yard Lands: హైదరాబాద్ కూకట్‌పల్లి ట్రక్ పార్క్ భూముల వేలం రద్దు అయింది. వేలం ప్రక్రియలో పాల్గొనేందుకు బిడ్డర్లు ముందుకు రాలేదు. ఒక్క బిడ్ కూడా దాఖలు లేదు. దాంతో అధికారులు వేలాన్ని రద్దు చేశారు. ట్రక్ పార్కింగ్ కోసం కేటాయించిన భూములను వేలం వేయొద్దంటూ బీఆర్ఎస్ పెద్దఎత్తున పోరాటం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ కీలక పరిణామం చోటుచేసుకుంది. అటు నియోపోలీస్ భూముల వేలం కూడా రద్దు అయ్యింది.
భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటారేమోనన్న భయం!
మరోవైపు, భవిష్యత్తులో ప్రభుత్వం మారితే తాము బిడ్డింగ్‌లో దక్కించుకున్న భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటారేమోనన్న ఆందోళనతోనే బిడ్డర్లు వేలం ప్రక్రియకు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో కోట్లాది రూపాయల విలువైన భూముల వేలం ప్రక్రియ ముందుకు సాగలేదు.
కోట్ల విలువైన భూములు.. వేలానికి స్పందన కరువు
మూసాపేట, కోకాపేట భూముల వేలానికి స్పందన కరువైంది. ఉదయం, మధ్యాహ్నం రెండు విడతలుగా భూములకు హెచ్ఎండీఏ వేలం ప్రక్రియ నిర్వహించింది. మూసాపేట ట్రక్ పార్క్, కోకాపేట నియోపోలీస్ భూముల వేలంలో ఇన్వెస్టర్లు, రియల్టర్లు పాల్గొనలేదు. ఈ భూముల కొనుగోలుకు ఆసక్తి చూపలేదు. మూసాపేటలో 3.15 ఎకరాల భూమి, కోకాపేట నియోపోలీస్ లేఔట్ లో 4.59 ఎకరాల భూముల వేలానికి హెచ్ఎండీఏ వేలం ప్రక్రియ నిర్వహించింది. మూసాపేట భూములకు ఎకరాకు కనీస ధర రూ.99 కోట్లు, కోకాపేట నియోపోలీస్ లేఔట్ భూములకు ఎకరాకు కనీస ధర రూ.120 కోట్లుగా నిర్ణయించింది.
ట్రక్ పార్క్ భూముల వేలానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పోరాటం
మూసాపేట ట్రక్ పార్క్ భూముల వేలం నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం రేపింది. ట్రక్ పార్క్ భూముల వేలాన్ని ప్రతిపక్ష బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. పెద్దఎత్తున పోరాటం చేస్తోంది. ప్రజా ఉద్యమాలు చేపట్టింది. కాగా, కూకట్‌పల్లి ట్రక్ పార్కింగ్ భూముల కోసం బీఆర్ఎస్ పోరాటం చేయడం ఇదే తొలిసారి కాదు.
2013లోనూ పెద్దఎత్తున ఆందోళన
2013లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ భూములను వేలం వేసేందుకు ప్రయత్నించింది. అప్పట్లో హరీష్ రావు నేతృత్వంలో టీఆర్ఎస్ పెద్దఎత్తున ఆందోళన చేపట్టింది. ట్రక్ పార్కింగ్ అవసరాల కోసం కేటాయించిన భూములను వేలం వేయడాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమించింది. ఈ పోరాటం నేపథ్యంలో అప్పటి ప్రభుత్వం వేలం ప్రతిపాదనను ఉపసంహరించుకుంది.
దాదాపు 13 ఏళ్ల తర్వాత మరోసారి అదే భూముల వేలం అంశం తెరపైకి రావడం, ఇప్పుడు ఒక్క బిడ్ కూడా రాక వేలం రద్దు కావడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
