VC Sajjanar: తెలంగాణ పోలీసు శాఖలో ఇటీవల జరిగిన ఐపీఎస్ బదిలీల్లో వీసీ సజ్జనార్ అంశం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ (సీపీ) వంటి అత్యంత కీలక బాధ్యతల నుంచి ఆయన్ను తప్పించి, ఫైర్ అండ్ డిజాస్టర్ రెస్పాన్స్ డీజీగా ప్రభుత్వం బదిలీ చేయడం వెనుక పలు ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నట్లు రాజకీయ, అధికార వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఒకప్పుడు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్‌గా ప్రజల చేత చప్పట్లు కొట్టించుకున్న ఆఫీసర్ బదిలీ అయితే, ఒకవైపు వీడ్కోలు సభలు జరుగుతుండగానే.. మరోవైపు పోలీసు శాఖలోని ఓ వర్గంలో అంతర్గతంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయనే ప్రచారం ఇప్పుడు సంచలనం రేపుతోంది.
అసలేం జరుగుతోంది?
హైదరాబాద్ సీపీగా బాధ్యతల నుంచి తప్పుకున్న సజ్జనార్‌కు కమిషనరేట్ సిబ్బంది తాళ్లతో కారును లాగుతూ ఘనంగా వీడ్కోలు పలికారు. కానీ, తెరవెనుక పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉందని పలు నివేదికలు పేర్కొంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవం తర్వాత ఓ ఉన్నతాధికారి బదిలీ అయితే పోలీసు వర్గాల్లోనే ఇంతలా చర్చ జరగడం, కొందరు అంతర్గతంగా సంతోషం వ్యక్తం చేయడం ఇదే తొలిసారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరోవైపు, మాజీ ఐపీఎస్ అధికారి మన్నెం నాగేశ్వరరావు సైతం సజ్జనార్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం ఈ వ్యవహారాన్ని మరింత వేడెక్కించింది.
అంతలా అసంతృప్తి రావడానికి కారణాలేంటి?
సజ్జనార్ బదిలీ వెనుక, అలాగే ఆయనపై సొంత శాఖలోనే కొందరు అధికారులు గుర్రుగా ఉండటం వెనుక పలు కారణాలు వినిపిస్తున్నాయి. ఒకే రాష్ట్రానికి చెందిన సుమారు 12 మంది ఐపీఎస్ అధికారులు ఓ గ్రూపుగా ఏర్పడి పోలీసు శాఖలో ఆధిపత్యం చెలాయించే ప్రయత్నం చేశారనే గుసగుసలు వినిపించాయి. దీనిపై విసిగిపోయిన ఇతర అధికారులు, గత ఏడాది కాలంగా జరిగిన కీలక వ్యవహారాల చిట్టాను ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.
ఖాకీ యూనిఫాంలో ఉంటూ భవిష్యత్తు రాజకీయ ఎంట్రీ కోసం సజ్జనార్ ప్రణాళికలు వేసుకున్నారని, అందుకోసం సోషల్ మీడియాలో పబ్లిసిటీపై ఎక్కువ దృష్టి పెట్టారనే ప్రచారం జరిగింది. కర్ణాటక సరిహద్దుల్లో భారీగా 300 ఎకరాల భూములు కొనుగోలు చేశారన్న ఆరోపణల నివేదికలు సీఎంఓకు చేరినట్లు కథనాలు వెలువడ్డాయి. సీపీ స్థాయిలో పర్యవేక్షించాల్సిన శాంతిభద్రతల అంశాలను పక్కనపెట్టి సొంత ప్రైవేట్ బృందాలతో వ్యవహారాలు నడిపించారనే విమర్శలు వచ్చాయి. దీనికి తోడు మాజీ మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ వ్యవహారంలో జోక్యంపై ఇంటెలిజెన్స్ నిఘా నివేదిక, కమిషనరేట్ పరిధిలో బదిలీలు, భూకబ్జా వ్యవహారాల్లో అవినీతి ఆరోపణలు ఆయనకు మైనస్‌గా మారాయని తెలుస్తోంది.
ఐపీఎస్ అధికారుల వార్తకు సంబంధించి జర్నలిస్టులను అరెస్ట్ చేయడం, ‘‘ఎక్కడున్నా పట్టుకొస్తా’’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వానికి కూడా ఇబ్బందికరంగా మారాయనే అభిప్రాయం వ్యక్తమైంది. మొత్తానికి, హైదరాబాద్ కొత్త సీపీగా మహేష్ భగవత్ బాధ్యతలు స్వీకరించగా, ఒకప్పుడు తిరుగులేని ఇమేజ్ ఉన్న సజ్జనార్ బదిలీ మాత్రం తెలంగాణ పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మిగిలిపోయింది.
