TG: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పరిధిలో వెలుగుచూసిన ఓ భూ రిజిస్ట్రేషన్ స్కామ్ స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఏకంగా ప్రభుత్వ సర్వే రికార్డులనే తారుమారు చేసి, నకిలీ సర్వే మ్యాప్ సృష్టించి భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్న వ్యవహారం బట్టబయలైంది. ఫరూక్నగర్ సబ్‌రిజిస్ట్రార్ నాసా దీపక్ స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ అక్రమ బాగోతం వెలుగులోకి వచ్చింది.
అసలు ఏం జరిగిందంటే..
నందిగామ గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 618లో ఉన్న ఎకరం 2.10 గుంటల భూమికి సంబంధించి 2026 అక్టోబర్ 16న రెక్టిఫికేషన్ డీడ్ రిజిస్ట్రేషన్ జరిగింది. ఆ సమయంలో నందిగామ మండల సర్వేయర్ జారీ చేసినట్లుగా ఒక సర్వే మ్యాప్, రిపోర్టును అధికారులకు సమర్పించారు. అయితే, ఈ రిజిస్ట్రేషన్ వెనుక పెద్ద మోసం జరిగిందని కొత్తూరు మండలం ఇమామ్‌నగర్‌కు చెందిన సట్టం రాజు అక్టోబర్ 28న ఫిర్యాదు చేయడంతో అసలు కథ మొదలైంది. ప్రభుత్వ రికార్డులను మార్చి, నకిలీ మ్యాప్‌తో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆయన ఆరోపించారు. దీంతో వెంటనే అప్రమత్తమైన సబ్‌రిజిస్ట్రార్, సంబంధిత వ్యక్తులకు నోటీసులు జారీ చేసి, నందిగామ తహసీల్దార్ ఆఫీసు నుంచి ఒరిజినల్ సర్వే మ్యాప్, రికార్డులను తెప్పించి పరిశీలించారు.
తహసీల్దార్ రికార్డులతో బట్టబయలైన ఫోర్జరీ
అసలు రికార్డులను చెక్ చేయగా అధికారులే ఆశ్చర్యపోయే నిజం బయటపడింది. తహసీల్దార్ ఆఫీసు రికార్డుల ప్రకారం సర్వే నంబర్ 618లోని భూమి ఎలాంటి అంతర్గత విభజనలు లేకుండా ఒకే ముక్కగా ఉంది. కానీ రిజిస్ట్రేషన్ సమయంలో సమర్పించిన మ్యాప్‌లో మాత్రం ఆ భూమిని ఎకరం 1.30 గుంటలు, ఎకరం 0.20 గుంటలుగా విభజించినట్లు చూపించారు. దీంతో పక్కాగా నకిలీ సర్వే మ్యాప్ సృష్టించి, ప్రభుత్వ పత్రాలను ఫోర్జరీ చేశారని నిర్ధారణ అయింది.
ఆరుగురిపై క్రిమినల్ కేసులు
ఈ ఫోర్జరీ వ్యవహారంపై రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 83 కింద ప్రాసిక్యూషన్ చర్యల కోసం నవంబర్ 2న జిల్లా రిజిస్ట్రార్‌కు నివేదిక పంపిన సబ్‌రిజిస్ట్రార్, అనంతరం షాద్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఈ కేసులో వర్కాల శ్రీదేవి, వర్కాల శ్రీరాములు, శాతం లింగం, శాతం రాములు, వర్కాల మనితేజ, కమ్మరి శ్రీశైలం తదితరులను నిందితులుగా చేర్చారు. ప్రభుత్వ భూ రికార్డులనే మార్చే స్థాయికి వీరు వెళ్లడం ఇప్పుడు షాద్‌నగర్ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది. ఈ నకిలీ పత్రాల తయారీ వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారు? రిజిస్ట్రేషన్ ప్రక్రియలో వీరికి ఎవరైనా సహకరించారా? అనే కోణాల్లో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
