తెలంగాణ

‘రాజీవ్‌ను చంపాలనే సెక్యూరిటీని తొలగించారు’.. సోనియా గాంధీ సంచలన ఆరోపణలు!

భారత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్యకు సంబంధించి ఆయన భార్య, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజీవ్ గాంధీ హత్యకు గురికావాలనే దురుద్దేశంతోనే అప్పట్లో ఆయనకు కల్పించిన భద్రతను తొలగించారని ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

భారత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్యకు సంబంధించి ఆయన భార్య, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజీవ్ గాంధీ హత్యకు గురికావాలనే దురుద్దేశంతోనే అప్పట్లో ఆయనకు కల్పించిన భద్రతను తొలగించారని ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన ఆత్మకథ 'బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్' (Belonging: A Journey of Love) పుస్తకం గురించి తన పిల్లలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో కలిసి ముచ్చటించిన ప్రత్యేక వీడియోను సోనియా గాంధీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్' (X) వేదికగా పంచుకున్నారు.

ఈ సంభాషణలో రాజీవ్ గాంధీ రాజకీయ ప్రయాణం, భద్రతా లోపాలు, నాటి చేదు జ్ఞాపకాలను ఆమె గుర్తుచేసుకున్నారు. తన జ్ఞాపకాల ఆధారంగా ఈ పుస్తకాన్ని రాశానని, దీనికి రాహుల్, ప్రియాంక తమ సొంత అనుభవాలను జోడించి కథలకు సరికొత్త జీవం పోశారని సోనియా గాంధీ పేర్కొన్నారు. తన పిల్లలే తనకు గొప్ప ఆనందం, బలమని చెబుతూనే, వారే తన సహనాన్ని అత్యధికంగా పరీక్షించే ఇద్దరు వ్యక్తులని చమత్కరించారు.

రాజీవ్ గాంధీ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సమయంలో ఓపెన్ జీపులో ప్రయాణిస్తూ ప్రజలను కలిసేవారని, ఆ క్రమంలో అనేకసార్లు రాళ్ల దాడులు, నిరసనలను ఎదుర్కొన్నారని తెలిపారు. ముఖ్యంగా ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో పర్యటించినప్పుడు ఆయా ప్రభుత్వాలు రాజీవ్‌కు సరైన భద్రతా ఏర్పాట్లు కల్పించేవి కావని ఆమె ఆరోపించారు. ఒకసారి తండ్రితో కలిసి బిహార్ పర్యటనకు వెళ్లిన రాహుల్ గాంధీ, అక్కడ రాజీవ్‌పై జరిగిన రాళ్ల దాడిని ప్రత్యక్షంగా చూసి తీవ్ర ఆందోళనకు గురయ్యారని సోనియా గుర్తుచేసుకున్నారు.

ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత నాన్న భద్రత విషయంలో తక్షణమే ఏదైనా చర్య తీసుకోకపోతే, త్వరలోనే ఆయన అంత్యక్రియలకు తిరిగి రావాల్సి వస్తుందని రాహుల్ తనతో అన్న మాటలను సోనియా తలుచుకుని భావోద్వేగానికి లోనయ్యారు. 1968లో ఇటలీ నుంచి భారత్‌కు అడుగుపెట్టిన తర్వాత ఇక్కడ గడిపిన తొలినాళ్ల జ్ఞాపకాలను కూడా ఆమె ఈ సందర్భంగా నెమరువేసుకున్నారు.

మరోవైపు లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. 500 పేజీలకు పైగా ఉన్న ఈ ఆత్మకథలో కూడా అమ్మ ఇంకా కొన్ని కీలక విషయాలను చెప్పకుండా వదిలేశారని వ్యాఖ్యానించారు. 2004లో ప్రధాని పదవిని వదులుకుంటూ సోనియా గాంధీ తీసుకున్న నిర్ణయం తమ కుటుంబంలో కొందరికి ఉపశమనాన్ని, మరికొందరికి సంతోషాన్ని ఇచ్చిందని గుర్తుచేశారు. తమ తండ్రికి భద్రతను తొలగించడం వెనుక ఒక ప్రత్యేక ఉద్దేశం ఉందని రాహుల్ పునరుద్ఘాటించారు. అమ్మ జీవిత ప్రయాణం అపారమైన ప్రేమతో పాటు భయంకరమైన విషాదాలతో నిండి ఉందని, వాటన్నింటినీ ఆమె ఎంతో గౌరవంతో, ధైర్యంతో ఎదుర్కొన్నారని రాహుల్ కొనియాడారు.

తర్వాత చదవండి