Harish Rao: కృష్ణా నదీ జలాల విషయంలో రేవంత్ సర్కార్ ను టార్గెట్ చేశారు మాజీమంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు. కృష్ణా నదీ జలాల్లో తెలంగాణ నీటి హక్కుల పరిరక్షణలో కాంగ్రెస్ పూర్తిగా వైఫల్యం చెందిందని విమర్శించారు. టోటల్ గా నీళ్ల విషయంలో రేవంత్ సర్కార్ అట్టర్ ఫ్లాప్ అయ్యిందని ధ్వజమెత్తారు. కృష్ణా నదిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంటేక్ వెల్ నిర్మిస్తుంటే రేవంత్ సర్కార్ మొద్దు నిద్రపోతోందని మండిపడ్డారు. ఇంటేక్ వెల్ ద్వారా రోజుకు 2 టీఎంసీల నీటిని ఏపీ తరలించుకుపోతోందని ఆయన ఆరోపించారు.
సాగర్ ను ఏపీ ఖాళీ చేస్తుంటే తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తోంది?
నాగార్జున సాగర్ ను ఏపీ ఖాళీ చేస్తుంటే తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తోందని హరీశ్ రావు ప్రశ్నించారు. బనకచర్ల విషయంలోనూ బీఆర్ఎస్ వెలుగులోకి తెచ్చే వరకు ప్రభుత్వానికి సోయి లేదని దుయ్యబట్టారు. నీటి వినియోగంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్పుడు లెక్కలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలన పక్కన పెట్టి ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేయడమే ప్రభుత్వం పనిగా పెట్టుకుందని హరీశ్ రావు ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం చేతగానితనానికి నిదర్శనం
''నాగార్జున సాగర్ పై ఏపీ నిర్మిస్తున్న ఇన్ టేక్ వెల్ నిర్మాణం కాంగ్రెస్ ప్రభుత్వం చేతగానితనానికి నిదర్శనం. తాగునీటి పేరుతో రోజుకు 2 టీఎంసీల నీరు తీసుకెళ్తున్నారు. నాగార్జున సాగర్ కింద బొక్కగొట్టి.. చుక్క నీరు లేకుండా, చివరికి హైదరాబాద్ నగరానికి తాగునీరు కూడా రాకుండా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తాగునీరు పేరిట మొత్తం నాగార్జున సాగర్ ను ఖాళీ చేసే కుట్ర చేస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్రపోతోంది. ప్రతిపక్షం అప్రమత్తం చేస్తే తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరుస్తలేదు. ఆనాడు గోదావరి బనకచెర్ల విషయంలోనూ బీఆర్ఎస్ పార్టీ బయట పెడితేనే బ్యాక్ డేట్ లో లెటర్లు రాశారు. ఇవాళ కూడా ఈ విషయాన్ని బీఆర్ఎస్ బయటపెడితేనే మళ్ళీ బ్యాక్ డేట్ లో లెటర్ రాసి మేమేదో పోరాడుతున్నాం అని బిల్డప్ ఇస్తున్నారు.
ఇది కమీషన్ల గవర్నమెంట్
కాంగ్రెస్ పార్టీకి కమీషన్ల మీద ధ్యాస ఉంది తప్ప.. ప్రజల మీద లేదు. ఈ మాట నేను చెప్పట్లేదు. స్వయంగా రేవంత్ మంత్రివర్గంలో ఉన్న కొండా సురేఖ చెప్పారు. నిన్న గాక మొన్న ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చెప్పారు. ఎమ్మెల్యేగా నేను చెప్పినా పనులు కావడం లేదు, 20శాతం కమీషన్ ఇస్తే పనులు అవుతున్నాయని అనిరుధ్ రెడ్డి అన్నారు. ఇక రాజగోపాల్ రెడ్డి కూడా.. ఇది కమీషన్ల గవర్నమెంట్, ఈ ప్రభుత్వం పని చేస్తలేదు, ప్రజల్లోకి పోతే నిలదీస్తున్నారు అని చెప్పారు. స్వయంగా కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలే ఇలా చెప్తున్న పరిస్థితి.
ఉత్తమ్ కుమార్ రెడ్డి అతి తెలివితేటలు ప్రదర్శిస్తున్నారు
ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ప్రభుత్వానికి కమీషన్ల మీద ధ్యాస ఉంది తప్ప రాష్ట్ర ప్రజల మీద రాష్ట్ర నీటి హక్కులు కాపాడే విషయంలో లేదు. గతంలో తాత్కాలిక ఒప్పందం కింద కృష్ణా నదిలో 34% నీళ్లు వాడుకునే అవకాశం మన రాష్ట్రానికి ఉంది. కానీ కాంగ్రెస్ ఈ మూడు సంవత్సరాల్లో రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఎవర్ లోయెస్ట్ యూటిలైజేషన్ ఆఫ్ వాటర్. ఉత్తమ్ కుమార్ రెడ్డి అతి తెలివితేటలు ప్రదర్శిస్తున్నారు. ఇవాళ శ్రీశైలంలో పవర్ జనరేషన్ చేసి సాగర్ లోకి నీళ్లు వదిలితే అది కూడా తెలంగాణ వాడుకుందని అనే అతి తెలివితేటలు ప్రదర్శించారు. మేమే నీళ్లు ఎక్కువ వాడామని అబద్ధాలను బొంకే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 9ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం కృష్ణా నదీ జలాల్లో వాడుకున్న దానికంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మూడు సంవత్సరాల్లో తక్కువ వాడింది.
కృష్ణా నదీ జలాల పరిరక్షణలో కాంగ్రెస్ వైఫల్యం
కృష్ణా నదీ జలాల పరిరక్షణలో కాంగ్రెస్ పూర్తిగా వైఫల్యం చెందింది. కృష్ణాలో మనకు 600 టీఎంసీలు దక్కాలని కేసీఆర్ పోరాడి ట్రిబ్యునల్ సాధిస్తే మూడేళ్ళయినా ట్రిబ్యునల్ ఉత్తరులు సాధించడంలో, ట్రిబ్యునల్ ముందు బలమైన వాదనలు వినిపించడంలో కాంగ్రెస్ ఫెయిల్ అయింది. నల్లగొండ జిల్లాకు చుక్క నీళ్లు రాకుండా బొక్కకొడుతుంటే, నల్లగొండ జిల్లా మంత్రిగా ఉండి, నీళ్ల మంత్రిగా ఉండి ఉత్తమ్ కు సోయి లేదంటే అసలు మీ పాలన ఎట్లుందో అర్థమవుతుంది.
నల్లగొండ జిల్లా ప్రజలకు శాశ్వత ద్రోహం
నల్లగొండ జిల్లా ప్రజలకు శాశ్వతంగా ఇది ద్రోహం. రేపు నల్లగొండ ప్రజలకు అటు తాగునీరు కానీ సాగర్ కెనాల్ కు కూడా నీళ్లు రానటువంటి పరిస్థితి ఏర్పడుతుంటే నీళ్ల మంత్రిగా ఉత్తమ్ ఏం చేస్తున్నారు? 9 నెలల నుంచి పనులు నడుస్తుంటే.. ప్రతిపక్షం, పత్రికలు బయటకు తెస్తే తప్ప ఈ ప్రభుత్వం పని చేస్తలేదు. ప్రభుత్వ ఇంటెలిజెన్స్ ఎంతసేపు ప్రతిపక్షాల ఫోన్లు ట్యాప్ చేయడం, ప్రతిపక్షాల వెంటపడడమే తప్ప రాష్ట్రానికి జరుగుతున్న నష్టం మీద పని చేయదు'' అంటూ హరీశ్ రావు విరుచుకుపడ్డారు.
