TG : కారులో ఒంటరిగా ప్రయాణిస్తే ట్రాఫిక్ పోలీసులు జరిమానా వేస్తారన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. నిజంగానే తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి కొత్త రూల్ ఏమైనా తీసుకొస్తోందా అని కారు ఓనర్లందరిలో ఒకటే టెన్షన్ మొదలైంది. అయితే, ఈ ప్రచారంపై తెలంగాణ పోలీసులు తాజాగా ఫుల్ క్లారిటీ ఇచ్చారు. అవన్నీ ఒట్టి ప్రచారాలే అని, అందులో ఎలాంటి నిజం లేదని తేల్చి చెప్పారు. పోలీసుల వివరణతో తెలంగాణ ప్రభుత్వ ఫ్యాక్ట్‌చెక్ విభాగం 'ఎక్స్' వేదికగా అధికారిక పోస్ట్ పెట్టింది.
అసలు నిజం ఏంటంటే?
నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు, ఒక్కొక్కరు ఒక్కో కారులో కాకుండా ఇతరులతో కలిసి ‘కార్‌పూలింగ్’ చేయాలని పోలీసులు ఇటీవల ప్రయాణికులకు సూచించారు. రోడ్లపై వాహనాల సంఖ్య తగ్గితే ట్రాఫిక్ కష్టాలు కొంతైనా తీరుతాయనే ఉద్దేశంతోనే ఈ విజ్ఞప్తి చేశారు. అయితే, దీన్ని కొందరు తప్పుగా అర్థం చేసుకుని.. కారులో ఒక్కరే వెళ్తే ఫైన్ విధిస్తూ ప్రభుత్వం కొత్త రూల్ తెస్తోందంటూ ప్రచారం మొదలుపెట్టారు.
జరిమానాలు వేసే ఆలోచనే లేదు
ఈ ఫేక్ ప్రచారంపై స్పందించిన పోలీసులు.. కారులో ఒంటరిగా ప్రయాణించే వారికి జరిమానాలు గానీ, శిక్షలు గానీ విధించే ప్రతిపాదన ఏదీ ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. ఉమ్మడి ప్రయాణాన్ని ప్రోత్సహించడమే తమ ఉద్దేశమని, దీనికి చలాన్లతో ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. ట్రాఫిక్ నియంత్రణ కోసం వీలైనంత వరకు ప్రజా రవాణా వ్యవస్థను వాడుకోవాలని, కార్‌పూలింగ్ వంటి మార్గాలను ఎంచుకోవాలని మాత్రమే ప్రజలకు సూచించినట్లు వివరించారు. కాబట్టి కారులో ఒంటరిగా వెళ్తే ఫైన్ పడుతుందన్న వదంతులను ఎవరూ నమ్మొద్దని పోలీసులు స్పష్టం చేశారు.
