తెలంగాణ

KRMB: తెలంగాణకు తీరని అన్యాయం.. పల్నాడు వాటర్ గ్రిడ్‌పై KRMBకి బీఆర్ఎస్ ఫిర్యాదు

హైదరాబాద్ జలసౌధలో కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (KRMB) చైర్మన్‌ను కలిశారు బీఆర్ఎస్ నేతలు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న పల్నాడు గ్రిడ్‌పైన, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టులపైన ఉమ్మడి నల్లగొండ, మహబూబ్‌నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల బీఆర్ఎస్ నాయకుల బృందం ఫిర్యాదు చేసింది.

KRMB: తెలంగాణ నీటి హక్కుల పరిరక్షణ కోసం బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. ఇందులో భాగంగా కృష్ణా నది యాజమాన్య బోర్డు (KRMB) చైర్మన్ ను కలిసింది. నాగార్జున సాగర్ జలాల వినియోగంలో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని ఆరోపిస్తూ కృష్ణా నది యాజమాన్య బోర్డ్ చైర్మన్ ను కలిశారు బీఆర్ఎస్ నేతలు. KRMB చైర్మన్ తో భేటీ అయిన బీఆర్ఎస్ నేతలు.. తెలంగాణ నీటి హక్కులకు సంబంధించిన అంశాలపై బోర్డుకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు చైర్మన్ కు వినతి పత్రం అందజేశారు. నాగార్జున సాగర్ జలాల వినియోగంలో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని వివరించారు. తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తున్న పరిణామాలను బోర్డు దృష్టికి తీసుకెళ్ళారు బీఆర్ఎస్ నేతలు. రాష్ట్రానికి దక్కాల్సిన నీటి వాటాల పరిరక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాలకు తాగు, సాగునీటి ముప్పు

హైదరాబాద్ జలసౌధలో కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (KRMB) చైర్మన్‌ను కలిశారు బీఆర్ఎస్ నేతలు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న పల్నాడు గ్రిడ్‌పైన, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టులపైన ఉమ్మడి నల్లగొండ, మహబూబ్‌నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల బీఆర్ఎస్ నాయకుల బృందం ఫిర్యాదు చేసింది. అనుమతులు లేకుండా నాగార్జునసాగర్ వద్ద ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణం చేపడుతోందని.. ఈ నిర్మాణాల వల్ల హైదరాబాద్ సహా రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాలకు తాగు, సాగునీటి ముప్పు ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తాగునీళ్ల పేరుతో నీటిని తరలిస్తూ హైదరాబాద్ భవిష్యత్తును అంధకారంలోకి నెట్టే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు.

నీటి పంపకాలు, కృష్ణా నది పరివాహకంపై ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తున్న ప్రాజెక్టులపై బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డుతో ప్రత్యేకంగా బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం సమావేశమైంది. వేర్వేరుగా రెండు వినతి పత్రాలు అందించారు. హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాకు సంబంధించి ప్రజాప్రతినిధులు ఒక వినతిపత్రం అందించారు. మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు మరో వినతి పత్రం ఇచ్చారు.

పల్నాడు వాటర్ గ్రిడ్‌తో తెలంగాణకు తీవ్ర అన్యాయం

ప్రధానంగా వారు లేవనెత్తిన అంశం పల్నాడు వాటర్ గ్రిడ్. ఏపీ ప్రభుత్వం నాగార్జున సాగర్ విజయ్ పురి సౌత్ వద్ద నిర్మిస్తున్న పల్నాడు వాటర్ గ్రిడ్ పై పెద్ద ఎత్తున అభ్యంతరం తెలిపారు. పల్నాడు వాటర్ గ్రిడ్ పేరుతో ఏపీ సర్కార్ ఇన్ టేక్ వెల్ నిర్మాణం చేస్తోందని.. అది డెడ్ స్టోరేజీ వద్ద కూడా 493 అడుగుల దగ్గర కూడా నీటిని తీసుకునే విధంగా ఆ ప్రాజెక్ట్ నిర్మాణం అవుతోందని, అది పూర్తైతే ముఖ్యంగా నాలుగు జిల్లాలకు హైదరాబాద్, రంగారెడ్డి తాగునీటికి.. మహబూబ్ నగర్, నల్లగొండ విషయంలో సాగునీటికి తీవ్ర అన్యాయం జరుగుతుందని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల బృందం ఆందోళన వ్యక్తం చేస్తోంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న ఇన్ టేక్ వెల్ నిర్మాణాన్ని వెంటనే ఆపేయాలని రివర్ బోర్డ్ మేనేజ్ మెంట్ కు బీఆర్ఎస్ నేతలు వినతిపత్రాలు అందజేశారు. ఇక డీపీఆర్ లేకుండా ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న మిగతా ప్రాజెక్టుల విషయంలోనూ రివర్ బోర్డ్ మేనేజ్ మెంట్ దృష్టి సారించాలని కోరారు.

హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం పరిస్థితి ఏంటి?

''ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ ప్రపంచంలో కొంచెం జ్ఞానం ఉన్న వాడికి ఎవడికైనా తెలుసు. 3 నెలల్లోనే కేవలం 40 లక్షల మంది ప్రజలు 9 టీఎంసీల నీళ్లు తాగుతారని అంటే ఇంతకు మించిన అబద్ధం ఇంకోటి ఉండదు. చంద్రబాబు అబద్ధాలకి అంతే లేదు. 3 నెలల్లోనే 30 లక్షల మందికి 9 టీఎంసీల నీళ్లు తాగిపిస్తారంటే.. మరి ఈ రెండున్నర కోట్ల మంది ప్రజలం ఇంకో సంవత్సరం ఎలా బతకాలి? హైదరాబాద్ నగరం పరిస్థితి ఏంటి? రంగారెడ్డి పరిస్థితి ఏంటి? మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మంలో పరిస్థితి ఏంటి? చంద్రబాబు సమాధానం చెప్పాలి.

కృష్ణా, గుంటూరు జిల్లాలకు నీళ్లు ఎలా తీసుకుపోతారు?

9 టీఎంసీల నీళ్లు కేవలం మనుషులకే పోతాయా? ఇందులో అన్నింటికంటే ప్రధానమైన విషయం పట్టిసీమ. దాని ద్వారా గోదావరి నీళ్లు 80 టీఎంసీలు తెచ్చుకుంటామని చెప్పారు. 80 కాకపోతే ఈ సంవత్సరం వచ్చిన 750 టీఎంసీలు గోదావరిలో వాళ్ళు వాడుకున్నారు. పట్టిసీమ వచ్చిన తర్వాత ఇంకా నూజువీడుకి సాగర్ నుంచి మంచి నీళ్లు ఎలా తీసుకపోతారు? కృష్ణా, గుంటూరు జిల్లాలకు మంచి నీళ్లు ఎలా తీసుకుపోతారు? ఇంతకు మించిన దుర్మార్గం ఏమైనా ఉంది? ఇంతకు మించిన అబద్ధాలు ఏమైనా ఉన్నాయా? కేఆర్ఎంబీని మోసం చేయడం తప్ప.

నాగార్జున సాగర్ పై కొత్తగా ఎటువంటి ప్రాజెక్టులు కట్టే హక్కులు ఏపీకి లేవు

వాస్తవానికి పట్టిసీమ తీసుకున్ననాడే సాగర్ పైన మేమిక ఒక్క ప్రాజెక్టు కూడా కట్టము అని చెప్పి రాసిచ్చి పట్టిసీమకు అనుమతి తీసుకున్నారు. పట్టిసీమ నుంచి ప్రకాశం బ్యారేజ్ కి నీళ్లు తీసుకొచ్చి మొత్తం కృష్ణా జిల్లాకు గుంటూరు జిల్లాలకు వాడుతున్నారో అప్పటినుంచే నాగార్జున సాగర్ పైన ఆంధ్రప్రదేశ్ కు కొత్తగా ఎటువంటి ప్రాజెక్టులు కట్టే హక్కులు లేవు. 40 టీఎంసీలు నాగార్జున సాగర్ ఎగువున మాకు ఇస్తారని చెప్పారు కాబట్టే మేము పాలమూరు-రంగారెడ్డి, పాలమూరు-డిండి ప్రాజెక్టులు కూడా కట్టుకున్నాం. ఆ పైనున్న ప్రాజెక్టులు ఏదైనా సరే తెలంగాణకు హక్కు ఉంది. ఎందుకు అంటే మాకు కృష్ణా తప్ప ఇంకొకటి లేదు. కానీ మీకు గోదావరి నుంచి నీళ్ళ వస్తున్నాయి. తెలిసి కూడా చంద్రబాబు మోసం చేశారు. కనీస సమాచారం ఇవ్వలేదు'' అని మాజీమంత్రి జగదీశ్ రెడ్డి మండిపడ్డారు.

తర్వాత చదవండి