జాతీయం

Delimitation Bill: పార్లమెంట్‌లో మరోసారి డీలిమిటేషన్ వేడి.. ఆ 361 ఓట్ల మ్యాజిక్ ఫిగర్ దాటేదెలా?

Delimitation Bill: దేశ రాజకీయాల్లో మరోసారి నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) అంశం హాట్ టాపిక్‌గా మారింది. రాజకీయ విశ్లేషకుల అంచనాల ప్రకారం.. ఈ నెలాఖరులో ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించి డీలిమిటేషన్ రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదింపజేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు చర్చ జరుగుతోంది.

Delimitation Bill: దేశ రాజకీయాల్లో మరోసారి నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) అంశం హాట్ టాపిక్‌గా మారింది. రాజకీయ విశ్లేషకుల అంచనాల ప్రకారం.. ఈ నెలాఖరులో ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించి డీలిమిటేషన్ రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదింపజేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. గత ఏప్రిల్‌లో సంఖ్యాబలం సరిపోక ఈ బిల్లు వీగిపోయిన నేపథ్యంలో, ఈసారి లోక్‌సభలో మూడింట రెండొంతుల (2/3) మెజారిటీ అంటే ఆ 361 ఓట్ల మ్యాజిక్ ఫిగర్‌ను కేంద్రం ఎలా దాటుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

గత అనుభవం.. ఇప్పుడేం మారింది?

రాజ్యాంగ సవరణ బిల్లు సభలో నెగ్గాలంటే సాధారణ మెజారిటీ సరిపోదు, సభకు హాజరై ఓటింగ్‌లో పాల్గొన్న సభ్యుల్లో మూడింట రెండొంతుల మద్దతు తప్పనిసరి. గత ఏప్రిల్‌లో ఈ బిల్లుపై జరిగిన ఓటింగ్‌లో 528 మంది ఎంపీలు పాల్గొనగా, బిల్లుకు అనుకూలంగా 298 ఓట్లు, వ్యతిరేకంగా 230 ఓట్లు పోలయ్యాయి. అప్పటి లెక్కల ప్రకారం కావాల్సిన 352 ఓట్ల మార్క్‌కు 54 ఓట్లు తక్కువ కావడంతో బిల్లు ఆగిపోయింది. జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచితే జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డీఎంకే అధినేత స్టాలిన్ సహా విపక్ష నేతలు అప్పట్లో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

361 మార్క్ చేరుకోవడానికి కేంద్రం ముందున్న సమీకరణాలు ఏంటి?

ప్రస్తుతం లోక్‌సభలో మూడు స్థానాలు ఖాళీగా ఉండటంతో మొత్తం సభ్యుల సంఖ్య 540గా ఉంది. ఒకవేళ సభ్యులందరూ సభకు హాజరై ఓటింగ్‌లో పాల్గొంటే, రాజ్యాంగ సవరణ బిల్లు పాస్ కావడానికి కచ్చితంగా 361 ఓట్లు అవసరం అవుతాయి. కొన్ని నివేదికలు ప్రకారం ప్రస్తుత బలాబలాలు ఇలా ఉన్నాయి. ప్రస్తుతం లోక్‌సభలో ఎన్డీఏ కూటమికి సుమారు 320 మంది ఎంపీల మద్దతు ఉంది. అంటే 361 మార్క్ చేరుకోవడానికి ఇంకా 41 ఓట్లు తగ్గుతున్నాయి.

తృణమూల్ కాంగ్రెస్ అసమ్మతి ఎంపీలు (20 మంది), శివసేన చీలిక వర్గం (6 గురు), వైఎస్సార్‌సీపీ (4 గురు) వంటి ఇతర పక్షాల మద్దతు కూడగట్టగలిగితే బలం 350కి చేరువవుతుందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రాజ్యాంగ నిబంధనల ప్రకారం బిల్లు ఆమోదానికి 'హాజరై ఓటు వేసిన వారిలో' మూడింట రెండొంతుల మెజారిటీ ఉంటే సరిపోతుంది. ఒకవేళ ఓటింగ్ సమయంలో కొందరు విపక్ష సభ్యులు సభ నుంచి వాకౌట్ చేసినా లేదా గైర్హాజరైనా, మొత్తం ఓటింగ్ సంఖ్య తగ్గిపోతుంది. ఉదాహరణకు 518 మంది మాత్రమే ఓటింగ్‌లో పాల్గొంటే, బిల్లు గట్టెక్కడానికి 345 ఓట్లు సరిపోతాయి. ఈ లెక్కన 15 నుంచి 18 ఓట్ల తేడాతో బిల్లును గట్టెక్కించవచ్చనే ధీమాలో అధికార పక్షం ఉన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

50 శాతం పెంపు ఫార్ములాతో విపక్షాలు మెత్తబడతాయా?

కేవలం సంఖ్యాబలమే కాకుండా, దక్షిణాది రాష్ట్రాల ఆందోళనను తగ్గించేందుకు అన్ని రాష్ట్రాలకు సమానంగా 50 శాతం సీట్లు పెంచే ప్రతిపాదనపై కేంద్రం దృష్టి సారించినట్లు సమాచారం. గత చర్చల సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం ఈ దిశగా సంకేతాలిచ్చారు. ఈ ఫార్ములా ప్రకారం లోక్‌సభ సీట్లు 543 నుంచి 850కి పెరిగితే, తెలంగాణలో 17 నుంచి 26కు, ఏపీలో 25 నుంచి 38కి, తమిళనాడులో 39 నుంచి 59కి, కర్ణాటకలో 28 నుంచి 42కి, కేరళలో 20 నుంచి 30కి స్థానాలు పెరుగుతాయి. దీనివల్ల దక్షిణాది వాటా సుమారు 23.76 శాతం వద్దే కొనసాగుతుందని కేంద్ర వర్గాలు వాదిస్తున్నాయి.

అయితే, కేవలం మాటల ద్వారా కాకుండా 50 శాతం పెంపు హామీని చట్టంలో స్పష్టంగా చేర్చాలని తెలంగాణ కాంగ్రెస్, తమిళనాడులోని డీఎంకే వంటి ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అఖిలపక్ష సమావేశం నిర్వహించి విపక్షాల సందేహాలను నివృత్తి చేస్తేనే బిల్లుకు మార్గం సుగమం అవుతుందని, లేదంటే మరోసారి సభలో గట్టి పోటీ తప్పదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

తర్వాత చదవండి