Revanth Reddy: తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్‌లో నిధుల కేటాయింపు, పెండింగ్ బిల్లులు, అధికారుల పనితీరు వంటి అంశాలపై సొంత ఎమ్మెల్యేలే బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేయడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటి నేతలు చేస్తున్న వ్యాఖ్యలు ప్రభుత్వ తీరుపై చర్చకు దారితీయడమే కాకుండా, ప్రతిపక్షాలకు విమర్శించే అవకాశాన్ని ఇస్తున్నాయని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
నిధుల వివక్షపై ఎమ్మెల్యేల గళం..
రాష్ట్రంలో అభివృద్ధి నిధులన్నీ కేవలం ముఖ్యమంత్రి, మంత్రుల నియోజకవర్గాలకే పరిమితమవుతున్నాయని అధికార పార్టీ ఎమ్మెల్యేల నుంచే విమర్శలు వినిపిస్తున్నాయి. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఇటీవల మాట్లాడుతూ.. తెలంగాణ అంటే కేవలం కొడంగల్ (సీఎం రేవంత్ రెడ్డి), మధిర (డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క), హుజూర్నగర్ (మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి) నియోజకవర్గాలు మాత్రమే కాదని ఒక కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. కొడంగల్‌కు రూ.10 వేల కోట్లు లేదా రూ.20 వేల కోట్లు ఇచ్చినా తమకు అభ్యంతరం లేదని, కానీ ఫ్లోరైడ్, కరువు పీడిత ప్రాంతమైన మునుగోడుకు కనీసం రూ.500 కోట్లు ఎందుకు కేటాయించడం లేదని ఆయన ప్రశ్నించారు. అంతర్గత సమావేశాల్లో నిధుల గురించి అడిగితే నాయకత్వం స్పందించడం లేదని, బయట మాట్లాడితే పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘన అంటున్నారని ఆయన అసహనం వ్యక్తం చేశారు.
మరోవైపు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి తన నియోజకవర్గంలో రోడ్లు, అభివృద్ధి పనుల బిల్లులు క్లియర్ కాక పనులు నిలిచిపోయాయని ఆరోపిస్తున్నారు. నిధులు విడుదల చేయకపోతే 30 వేల మందితో కలిసి జడ్చర్లలో ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని ఆయన గతంలో హెచ్చరించారు. అంతేకాకుండా, రాజకీయ నాయకుల కంటే ప్రభుత్వ అధికారుల్లోనే అవినీతి ఎక్కువగా ఉందని, కాంట్రాక్టర్ల బిల్లుల క్లియరెన్స్ కోసం 10 నుంచి 20 శాతం వరకు కమిషన్లు అడుగుతున్నారని ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.
పార్టీలో అంతర్గత చర్చ
అనిరుద్ రెడ్డి వ్యవహారశైలి మొదటి నుంచీ చర్చనీయాంశంగానే ఉంది. తనకు టికెట్ ఇప్పించడంలో కీలక పాత్ర పోషించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో ఏదుల రిజర్వాయర్ నీటి తరలింపు విషయంలో విభేదించడం, రెవెన్యూ శాఖపై హైకోర్టులో కేసు వేయడం వంటి అంశాలు పార్టీలో చర్చకు దారితీశాయి. గతంలో కొందరు ఎమ్మెల్యేలతో కలిసి ఆయన ఏర్పాటు చేసిన విందు సమావేశంపైనా అధిష్టానం ఆరా తీసింది. సొంత ఎమ్మెల్యేల వ్యాఖ్యలను ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అస్త్రంగా మార్చుకుంటుంది.
మరోవైపు, కాంగ్రెస్ సీనియర్ వర్గాలు ఈ పరిణామాలను భిన్నంగా విశ్లేషిస్తున్నాయి. తమ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువని, అందుకే నేతలు తమ నియోజకవర్గ సమస్యలపై బహిరంగంగా గళం విప్పుతున్నారని చెబుతున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా నిధుల విడుదలలో కొంత జాప్యం జరుగుతున్న మాట వాస్తవమేనని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గతంలో పేర్కొన్నారు. అయితే, పార్టీ లైన్ దాటి మాట్లాడే నేతల వ్యవహారం అధిష్ఠానం దృష్టిలో ఉందని, సమన్వయంతో సమస్యలను పరిష్కరించేందుకు నాయకత్వం ప్రయత్నిస్తోందని పార్టీ వర్గాలు తెలిపాయి.
