Karimnagar: కరీంనగర్ జిల్లా గంగాధర మండలం రంగారావుపల్లి గ్రామంలో వృద్ధురాలు దోమకొండ శంకరమ్మ (70) అనుమానాస్పద మృతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. డబ్బులు, బంగారంపై దురాశతో భర్త దోమకొండ రామయ్య (80) భార్యను హత్య చేశాడు. ఈ కేసులో రామయ్య, హత్యకు సహకరించిన మృతురాలి మనవడిని (మైనర్) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూడ్చి పెట్టిన మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించడంతో పాటు, సాంకేతిక ఇతర ఆధారాలతో కేసులో మిస్టరీని ఛేదించారు పోలీసులు.
భార్య దగ్గరున్న డబ్బు, బంగారంపై భర్త కన్ను
దోమకొండ రామయ్య, శంకరమ్మ దంపతులు. అయితే, కుటుంబ కలహాల కారణంగా దంపతులు ఒకే ఇంట్లోనే వేర్వేరు గదుల్లో నివాసం ఉంటున్నారు. శంకరమ్మ కూలి పనులు చేస్తుంది. అలా సంపాదించిన డబ్బు తనకు ఇవ్వడం లేదని రామయ్య ఆమెపై కక్ష పెంచుకున్నాడు. అంతేకాకుండా ఆమె వద్ద ఉన్న డబ్బులు, బంగారంపై అతడి కన్ను పడింది. భార్యను చంపితే ఆ డబ్బు, బంగారం తనవే అని ఫిక్స్ అయిపోయాడు. భార్య హత్యకు పథకం రచించాడు. ఇందులో భాగంగా మనవడికి మద్యం తాగించాడు. ఖర్చుల కోసం డబ్బులు ఇస్తానని ఆశ చూపించి శంకమ్మ హత్యకు సహకరించేలా అతడిని ప్రేరేపించాడు.
మనవడి సాయంతో హత్య
ఈ క్రమంలో 08-11-2026 రోజున సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో రామయ్య తన ప్లాన్ అమలు చేశాడు. వెనుక నుంచి భార్య శంకరమ్మ నడుము భాగంలో బలంగా కొట్టి కింద పడేశాడు. వెంటనే మనవడు వచ్చి ఆమె చేతులు, కాళ్లు గట్టిగా పట్టుకున్నాడు. అనంతరం రామయ్య చీరతో ఆమె మెడకు బిగించి ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.
హత్య అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా నిందితులు ఏమీ తెలియనట్లు నటించారు. శంకరమ్మ అనారోగ్యంతో రక్తం కక్కి మరణించిందని అందరినీ నమ్మించారు. మరుసటి రోజు అంత్యక్రియలు నిర్వహించి మృతదేహాన్ని పూడ్చిపెట్టారు.
పోస్టుమార్టంతో బయటపడిన దారుణం
శంకరమ్మ మరణంపై ఆమె పెద్ద కుమారుడు దోమకొండ అంజయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు గంగాధర ఎస్సై వంశీకృష్ణ అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా 21-11-2026 రోజున మండల తహసీల్దార్, వైద్యాధికారి సమక్షంలో పూడ్చిపెట్టిన మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించారు. పోలీసులు సేకరించిన సాంకేతిక, ఇతర ఆధారాలు, విచారణ ద్వారా ఈ హత్యకు పాల్పడిన వారిని గుర్తించారు. విచారణలో నిందితులు నేరానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. హత్యకు ఉపయోగించిన చీరను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
