తెలంగాణ

Borewells: కొత్త బోర్లపై నిషేధం.. వసూల్ రాజాలకు వరంగా మారిన ప్రభుత్వ విధానం.. కోట్లు సంపాదిస్తున్న బోరు మాఫియా!

ఒక లేఅవుట్‌లో ప్లాట్ కొన్న సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలంటే మొదట కావాల్సింది నీరు. అయితే, బోరు వేస్తే కేసు. వేయకపోతే నిర్మాణం ఆగిపోతుంది. ఈ ఇరకాటంలో చిక్కుకున్న సామాన్యుడిని ఆదుకునే వారు ఎవరూ లేరు.

Borewells: తెలంగాణలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఒకవైపు భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని, బోర్లు వేయవద్దని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. మరోవైపు అదే ప్రభుత్వం ఎడాపెడా నిర్మాణ అనుమతులు మాత్రం జారీ చేస్తూనే ఉంది. నీరు లేకుండా ఇల్లు ఎలా కట్టాలి? నీరు లేకుండా మనిషి ఎలా బతకాలి? అనే ప్రశ్నకు ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. కానీ ఈ వైరుధ్యమే నేడు కొందరికి కాసుల పంటగా మారిందన్న విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి.

అధికారులను మేనేజ్ చేసే పేరుతో వేలకు వేలు వసూలు

ఒక లేఅవుట్‌లో ప్లాట్ కొన్న సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలంటే మొదట కావాల్సింది నీరు. అయితే, బోరు వేస్తే కేసు. వేయకపోతే నిర్మాణం ఆగిపోతుంది. ఈ ఇరకాటంలో చిక్కుకున్న సామాన్యుడిని ఆదుకునే వారు ఎవరూ లేరు. అదే సమయంలో వసూల్ రాజాలు రంగంలోకి దిగుతారు. "మీరు బోరు వేసుకోండి, మేము చూసుకుంటాం" అంటూ బేరం మొదలవుతుంది. అనుమతి లేని బోరుకు అనుమతి ఇప్పించే పేరుతో, అధికారులను మేనేజ్ చేసే పేరుతో వేలకు వేలు వసూలు చేస్తారు. ప్రభుత్వం నిషేధించిన బోరు.. వసూల్ రాజాల చేతిలో లీగల్ అయిపోతుంది.

నిర్మాణ అనుమతి ఇచ్చేటప్పుడు నీటి వసతి ఉందా లేదా అని ప్రభుత్వం ఎందుకు చూడదు? బోరుకు నిషేధం ఉన్న చోట భవన నిర్మాణానికి అనుమతి ఇవ్వడం అంటే ఏమిటి? ఇది ప్రజలను కావాలని దళారుల చేతిలోకి నెట్టడం కాదా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

అవినీతికి దారితీసిన బోర్లపై నిషేధం

నిజానికి ప్రభుత్వం చేయాల్సింది బోర్లను నిషేధించడం కాదు, భూగర్భ జలాలను పెంచడం. చెరువులు, కుంటలు నింపడం. వర్షపు నీటిని ఒడిసిపట్టడం. ప్రతి లేఅవుట్‌లో తప్పనిసరిగా వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ ఏర్పాటు చేయించడం. అలా చేయకుండా కేవలం నిషేధం విధిస్తే అది అవినీతికి దారి తీస్తుంది తప్ప నీటి సంరక్షణకు కాదని మేధావులు చెబుతున్నారు.

కోట్లు సంపాదిస్తున్న బోరు మాఫియా

ఒకవైపు నీటి కోసం ప్రజలు అల్లాడుతుంటే, మరోవైపు ట్యాంకర్ మాఫియా, బోరు మాఫియా కోట్లు సంపాదిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ అనుమతులు వీరికి లైసెన్స్‌లుగా మారాయి. ప్రభుత్వం వెంటనే ఈ విధానాన్ని సమీక్షించాలి అనే డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. బోరు వేయాలా వద్దా అనేది శాస్త్రీయంగా, ప్రాంతాల వారీగా నిర్ణయించాలని మేధావులు సూచిస్తున్నారు. నిర్మాణ అనుమతితో పాటే నీటి సదుపాయానికి స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలని కోరుతున్నారు. లేకపోతే ఈ "బోర్లు వద్దు - భవనాలు ముద్దు" విధానం సామాన్యుడిని దోచుకోవడానికి.. వసూల్ రాజాలకు ఇచ్చిన పర్మనెంట్ పర్మిషన్‌గానే మిగిలిపోతుందని హెచ్చరిస్తున్నారు.

తర్వాత చదవండి