తెలంగాణ

ఇంటర్ బోర్డు రద్దుతో స్టూడెంట్లకు ఒరిగేదేంటి.. ఆ ఫీజుల దోపిడీ సంగతేంటి?

6 నిమిషాల పఠనం

Telangana Politics: తెలంగాణలో 2027–28 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ బోర్డును రద్దు చేసి, స్కూల్ ఎడ్యుకేషన్‌లో కలిపేస్తూ 10+2 విధానాన్ని అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయం బయటకు రాగానే సోషల్ మీడియాలో ఒకటే ప్రచారం మొదలైంది.

Telangana Politics: తెలంగాణలో 2027–28 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ బోర్డును రద్దు చేసి, స్కూల్ ఎడ్యుకేషన్‌లో కలిపేస్తూ 10+2 విధానాన్ని అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయం బయటకు రాగానే సోషల్ మీడియాలో ఒకటే ప్రచారం మొదలైంది. "ఇక శ్రీ చైతన్య, నారాయణ లాంటి కార్పొరేట్ కాలేజీల మాఫియాకు చెక్ పడినట్లే.. లక్షల రూపాయల ఫీజుల దోపిడీ ఆగిపోయినట్లే.. రేవంత్ రెడ్డి తోపు, తురుము" అంటూ కొందరు నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. కానీ, అసలు గ్రౌండ్ రియాలిటీ చూస్తే మాత్రం సీన్ వేరేలా కనిపిస్తోంది. కేవలం బోర్డును ఎత్తేసి 10+2 తీసుకొచ్చినంత మాత్రాన ఆ ఫీజుల దోపిడీ నిజంగా ఆగుతుందా? దీనివల్ల సామాన్య తల్లిదండ్రులకు ఒరిగేదేంటి? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

కాలేజీలు పోయి స్కూళ్లు వస్తే ఫీజులు తగ్గుతాయా?

కొత్త 10+2 విధానం ప్రకారం సీబీఎస్ఈ తరహాలో 9 నుంచి 12వ తరగతి వరకు ఒకే గొడుగు కిందకు వస్తాయి. ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే.. ప్రస్తుతం ఉన్న ప్రైవేట్ జూనియర్ కాలేజీలను ప్రభుత్వం మూసివేయడం లేదు. పైగా, వసతులు ఉన్న జూనియర్ కాలేజీలు 1 నుంచి 10వ తరగతి వరకు స్కూళ్లు పెట్టుకోవడానికి, అలాగే హైస్కూళ్లు 11, 12 తరగతులు పెట్టుకోవడానికి అనుమతులు ఇస్తామని చెబుతోంది.

ఇప్పటికే శ్రీ చైతన్య, నారాయణ, భాష్యం లాంటి కార్పొరేట్ విద్యాసంస్థలకు సొంతంగా స్కూళ్లు కూడా ఉన్నాయి కదా. రేపు 10+2 విధానం అమల్లోకి వస్తే, ఆ సంస్థలు తమ స్కూళ్లలోనే 11, 12 తరగతులకు పర్మిషన్లు తెచ్చుకుంటాయి. అప్పుడు జూనియర్ కాలేజీ బదులు 'స్కూల్' పేరుతో మళ్లీ యథావిధిగా లక్షల రూపాయల ఫీజులు వసూలు చేయరా? ఇప్పటికే పదో తరగతి వరకే ప్రైవేట్ స్కూళ్లలో లక్షల్లో ఫీజులు గుంజుతున్నారు. అలాంటప్పుడు 11, 12 తరగతులకు వాళ్లు ఫీజులు తగ్గిస్తారని తల్లిదండ్రులు ఎలా నమ్మగలరు? కార్పొరేట్ సంస్థల జిమ్మిక్కుల ముందు కేవలం బోర్డు రద్దు అనేది పెద్ద అడ్డంకి ఏమీ కాదు.

నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఫీజుల జీవో తీసుకురండి!

కేవలం ఇంటర్ బోర్డును రద్దు చేశామని డబ్బా కొట్టుకోవడం వల్ల సామాన్యుల జేబులకు చిల్లు పడటం ఆగదు. ప్రభుత్వానికి నిజంగా తల్లిదండ్రుల భారం తగ్గించాలనే ఆలోచన ఉంటే, ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలలో ఫీజులను నియంత్రిస్తూ కఠినమైన జీవో తీసుకురావాలని అంటున్నారు. ఏ తరగతికి ఎంత ఫీజు వసూలు చేయాలో ఫిక్స్ చేసి, అంతకంటే ఎక్కువ వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకునే దమ్ము చూపించాలి. అప్పుడే మధ్యతరగతి ప్రజలకు నిజమైన మేలు జరుగుతుందని సామాన్య జనాలు అంటున్నారు.

ముందు గురుకులాలు, సర్కారీ బడుల సంగతి చూడండి..

మరోవైపు, ప్రభుత్వ విద్యావ్యవస్థను బలోపేతం చేయకుండా ఇలాంటి మార్పులు చేయడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు కనీసం సరైన భోజనం కూడా అందడం లేదు. అన్నంలో పురుగులు రావడం లాంటి దారుణ ఘటనలు చూస్తూనే ఉన్నాం. చాలా ప్రభుత్వ పాఠశాలల్లో సరైన టీచర్లు లేరు, కనీస మౌలిక వసతులు కరువయ్యాయి.

ముందు ఆ గురుకులాలను, ప్రభుత్వ స్కూళ్లను బాగు చేసి, పేద పిల్లలకు నాణ్యమైన తిండి, చదువు అందేలా చూడాలి. అటు ప్రైవేట్ స్కూళ్ల ఫీజులను తగ్గిస్తూ, ఇటు ప్రభుత్వ స్కూళ్లను డెవలప్ చేసినప్పుడే విద్యావ్యవస్థలో అసలైన మార్పు వస్తుంది తప్ప.. కేవలం 10+2 పేరుతో ప్రచారం చేసుకోవడం వల్ల తల్లిదండ్రులకు ఒరిగేదేమీ ఉండదని అంటున్నారు.

#Telangana Politics#Telangana Education News#Intermediate Board Abolition#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి