Iran Crisis: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధిస్తున్న కఠిన ఆంక్షలు, యుద్ధ వాతావరణం ఇరాన్‌ను కోలుకోలేని దెబ్బ తీశాయి. అగ్రరాజ్యం అనుసరిస్తున్న కఠిన వైఖరితో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోయింది. పాలకుల మధ్య సాగుతున్న ఆధిపత్య పోరుకు సామాన్య ప్రజలు నిలువునా బలవుతున్నారు. చివరికి పూట గడవక, పెరిగిపోయిన అప్పులు తీర్చుకోలేక ఇరాన్ ప్రజలు సొంత శరీర భాగాలనే అమ్ముకునే దుస్థితికి దిగజారారు. కిడ్నీలు, కాలేయ కణజాలం, ఎముక మజ్జ, చివరికి వృషణాలను సైతం అమ్మకానికి పెడుతున్నారంటే అక్కడ పరిస్థితి ఎంత భయానకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. స్వయంగా ఇరాన్ వార్తా సంస్థ 'ఇల్నా' ఈ కన్నీటి గాథలను బయటపెట్టింది.
గోడల నిండా అవయవాల అమ్మకం పోస్టర్లు!
మధ్య ఇరాన్‌లోని పలు ప్రాంతాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా 'మా అవయవాలు అమ్ముతాం' అంటూ గోడలపై రాసిన ప్రకటనలే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అక్కడ ‘కిడ్నీ స్ట్రీట్’ అని పిలిచే 'ఫర్హంగ్ హెస్సేనీ' వీధిలో ఈ పోస్టర్లు విపరీతంగా వెలిశాయి. ఈ వీధికి దగ్గర్లోనే మున్సిపల్ వైద్య కేంద్రంతో పాటు కిడ్నీ రోగులకు సాయం చేసే ఒక స్వచ్ఛంద సంస్థ ఉంది. దీంతో అవయవాలు కొనుగోలు చేయాలనుకునే వాళ్లంతా నేరుగా ఈ వీధికి వచ్చి బేరసారాలు జరుపుతున్నారు.
బ్లడ్ గ్రూప్‌ను బట్టి ధర.. కిడ్నీ రేటు ఎంతో తెలుసా?
అప్పుల బాధ తట్టుకోలేక, కడుపు నింపుకోవడానికి వేరే దారి లేకనే జనం ఇలా ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారని అక్కడి వైద్య సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అవయవాల ధరలు మనిషి బ్లడ్ గ్రూప్‌ను బట్టి మారుతున్నాయి. అరుదైన బ్లడ్ గ్రూప్ ఉన్నవారికి కొనుగోలుదారులు మరింత ఎక్కువ డబ్బులు ఇచ్చేందుకు సిద్ధపడుతున్నారు. అలాగే ప్రస్తుతం అక్కడ ఒక కిడ్నీ ధర 30 బిలియన్ల నుంచి 40 బిలియన్ ఇరానియన్ రియాళ్ల వరకు పలుకుతోంది. అంటే అమెరికన్ డాలర్లలో చూస్తే సుమారు 11,500 నుంచి 15,300 డాలర్లు అన్నమాట.
ట్రంప్ ఆంక్షల ఉచ్చులో సామాన్యుల ప్రాణాలు!
అమెరికా ఆంక్షల వల్ల ఇరాన్‌లో ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకింది. కరెన్సీ విలువ దారుణంగా పడిపోవడంతో నిత్యావసర వస్తువులు కొనలేక సామాన్య కుటుంబాలు అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. ఆ అప్పుల నుంచి బయటపడేందుకు కిడ్నీలే కాకుండా ఇతర ముఖ్యమైన శరీర భాగాలను సైతం అమ్ముకోవడానికి జనం సిద్ధమవుతున్నారు. దేశాల మధ్య సాగుతున్న యుద్ధాలు, ఆంక్షల రాజకీయాలు చివరికి సామాన్యుల ప్రాణాలతో, శరీరాలతో వ్యాపారం చేసే స్థాయికి తీసుకొచ్చాయి. ఈ దారుణ పరిస్థితులపై అంతర్జాతీయ సమాజం తక్షణమే స్పందించకపోతే ఇరాన్‌లో మానవతా సంక్షోభం మరింత ముదిరే ప్రమాదం ఉంది.


