తెలంగాణ

ACB Raids: మొయినాబాద్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఇంట్లో ఏసీబీ సోదాల కలకలం

5 నిమిషాల పఠనం

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గుండు వాణి నివాసంలో ఏసీబీ సోదాలు కలకలం రేపాయి. లంచం తీసుకుంటూ రెండు నెలల క్రితం ప్లానింగ్ ఆఫీసర్ వాణి పట్టుబడ్డారు.

ACB Raids: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గుండు వాణి నివాసంలో ఏసీబీ సోదాలు కలకలం రేపాయి. లంచం తీసుకుంటూ రెండు నెలల క్రితం ప్లానింగ్ ఆఫీసర్ వాణి పట్టుబడ్డారు. ఆమెపై కేసు నమోదు చేసి విచారణలో కీలక విషయాలు రాబట్టారు అధికారులు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు రావడంతో గుండు వాణి నివాసంతో పాటు బంధువుల ఇళ్లలోనూ తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలో మొత్తం 8 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. వాణికి చెందిన స్థిర, చరాస్తులపై ఆరా తీశారు. బ్యాంకు ఖాతాలు, ఆర్థిక లావాదేవీలను పరిశీలించారు. గుండు వాణి భర్త, బినామీలు, బంధువులు, సన్నిహితుల పేర్ల మీద భారీగా ఆస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

75వేలు లంచం తీసుకుంటూ దొరికిపోయారు

''మొయినాబాద్ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ వాణి 75వేలు లంచం డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 30న ట్రాప్ చేసి లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్ గా వాణిని పట్టుకున్నాం. తన అసిస్టెంట్ ద్వారా లంచం తీసుకున్నారు. వాణి అసిస్టెంట్ సుదర్శన్ ను కూడా అదుపులోకి తీసుకున్నాము. అదే రోజున వాణి ఇంట్లో తనిఖీలు చేశాము. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు విచారణలో గుర్తించాము. ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి, ఎవరెవరి పేరు మీద ఉన్నాయి, వాణి భర్త పేరు మీద ఏమున్నాయి విచారిస్తున్నాము. ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేశాము. హైదరాబాద్ లో 4 చోట్ల, మహబూబ్ నగర్ లో 4 చోట్ల తనిఖీలు చేపట్టాము'' అని ఏసీబీ అధికారులు తెలిపారు.

అక్రమ ఆస్తుల కేసు నమోదు

టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గుండు వాణిపై అక్రమ ఆస్తుల కేసు నమోదు చేసినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. ఆదాయ వనరులకు మించి అవినీతి, అక్రమ మార్గాల ద్వారా ఆస్తులను కూడబెట్టారనే ఆరోపణలపై కేసు ఫైల్ చేసినట్లు వివరించారు. గుండు వాణి నివాసం, కార్యాలయం, అలాగే ఆమె బంధువులు, స్నేహితులు, సహచరులు, బినామీలుగా అనుమానించబడుతున్న వ్యక్తులకు చెందిన ఆస్తులు సహా మొత్తం 8 చోట్ల సోదాలు నిర్వహించారు.

భారీగా ఆస్తులు గుర్తింపు

అధికారులు తమ తనిఖీల్లో.. జడ్చర్ల, పాలకూర్తిలలో రెండు ఖాళీ స్థలాలను, అత్తాపూర్‌లో ఒక ఫ్లాట్‌, G+2 నివాస భవనాన్ని, అలాగే కోయిల్‌కొండ మండలంలో 1.10 ఎకరాల వ్యవసాయ భూమిని గుర్తించారు. ఈ స్థిరాస్తుల విలువ రూ. 4.25 కోట్లుగా అంచనా వేశారు. ఈ సోదాల్లో రూ. 5.47 లక్షల నగదు, మహబూబ్‌నగర్‌లోని 'తుల్జా భవాని వైన్స్'లో రూ. 50 లక్షల పెట్టుబడులు, రూ. 1.30 కోట్ల విలువైన షేర్లు, బ్యాంకు ఖాతాల్లో రూ. 7.97 లక్షల నిల్వలు, 175.1 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ. 50 లక్షల విలువైన వాహనాలు, రూ. 5.10 లక్షల విలువైన గృహోపకరణాలు బయటపడ్డాయి. ఆస్తుల మొత్తం విలువ రూ. 6కోట్ల 76లక్షల 45వేల 738గా అంచనా వేశారు. ఈ ఆస్తుల మార్కెట్ విలువ ఇంకా చాలా ఎక్కువగా ఉండొచ్చని అధికారులు పేర్కొన్నారు.

సెప్టెంబర్ 30న పంచాయతీ కార్యదర్శి ద్వారా 75వేల లంచం తీసుకుంటుండగా గుండు వాణి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ప్రస్తుతం ఆమె జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. అక్రమ ఆస్తుల కేసులో ఆమెను 'ప్రిజనర్ ట్రాన్సిట్ వారెంట్' (పీటీ వారెంట్) ద్వారా హైదరాబాద్‌లోని ప్రత్యేక ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు.

#ACB Raids#Moinabad#Town Planning Officer#Swechaa News#Gundu Vani
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి