తెలంగాణ

Harish Rao: మూడేళ్ల అధికారంలో మీరు చేసిందేమిటి? సీఎం రేవంత్ పై హరీశ్ రావు ఫైర్

4 నిమిషాల పఠనం

మూడేళ్లు అవుతోంది అధికారంలోకి వచ్చి.. ఒక్క ప్రాజెక్ట్ అయినా పూర్తి చేశారా? కొత్తగా ఒక్క ప్రాజెక్ట్ అన్నా కట్టారా? ఒక్క ఎకరానికన్నా నీళ్లు ఇచ్చారా? ఒక్క చెరువు అన్నా కట్టారా? మీరు చేసిందేమీ లేదు.

Harish Rao: ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఏ ముఖం పెట్టుకుని సిద్ధిపేటకు వస్తున్నారని మాజీమంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. మాజీ సీఎం కేసీఆర్ నిర్మించిన ఆయిల్ పామ్ ఫ్యాక్టరీకి రిబ్బన్ కట్ చేసేందుకు రేవంత్ రెడ్డి మార్చి 22, 2026 నాడు సిద్ధిపేటకు వచ్చారని.. ఆరోజు మీటింగ్ లో 45 రోజుల్లో 9 వేల కోట్ల రైతు భరోసా నిధులు వేస్తామని రాష్ట్ర రైతాంగానికి హామీ ఇచ్చారని గుర్తు చేశారు. 230 రోజులు అవుతున్నా.. ఈ రోజుకు కూడా డబ్బులు ఇవ్వలేదని మండిపడ్డారు.

దేవుళ్ల మీద ఒట్లు వేసి మోసం చేశారు

సీఎం రేవంత్ రెడ్డి దేవుళ్ల మీద ఒట్లు వేసి మాట తప్పినందుకు ఈరోజు రాష్ట్రానికి అరిష్టం కలిగిందన్నారు హరీశ్ రావు. రేవంత్ పాపం వల్లనే రాష్ట్రానికి కరువు వచ్చిందని ధ్వజమెత్తారు. మే 2, 2024 నాడు మొదటిసారి రేవంత్ రెడ్డి సిద్ధిపేటకు వచ్చినప్పుడు కొమురవెల్లి మల్లన్న సాక్షిగా పంద్రాగస్టు లోపల 2లక్షల రుణమాఫీ చేస్తా అన్నారని.. ఇప్పటికీ మూడు పంద్రాగస్టులు పోయాయి.. కానీ రైతు రుణమాఫీ కాని పరిస్థితి ఉందని వాపోయారు. సిద్ధిపేటలో మీడియాతో మాట్లాడారు హరీశ్ రావు.

మూడేళ్లు అధికారంలో ఉండి చేసిందేంటి?

''హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయలేదు. రుణమాఫీ విషయంలో దేవుళ్ల మీద ఒట్లు వేసి సీఎం రేవంత్ మాట తప్పారు. రైతుబంధు ఇవ్వకుండా రైతులను ఇబ్బందులు పెడుతున్నారు. సిద్ధిపేటకు కాంగ్రెస్ చేసిందేమీ లేదు. మీరు చేసిన తప్పులను సరిదిద్ది, నీళ్లు లేని చోట నుండి నీళ్లు ఉన్న చోటుకి మార్చింది బీఆర్ఎస్. మీరు ఆనాడు ఏడేళ్లు వృథా చేశారు, ఈనాడు మూడేళ్లు వృథా చేశారు.

మూడేళ్లు అవుతోంది అధికారంలోకి వచ్చి.. ఒక్క ప్రాజెక్ట్ అయినా పూర్తి చేశారా? కొత్తగా ఒక్క ప్రాజెక్ట్ అన్నా కట్టారా? ఒక్క ఎకరానికన్నా నీళ్లు ఇచ్చారా? ఒక్క చెరువు అన్నా కట్టారా? మీరు చేసిందేమీ లేదు. ఎంతసేపు బీఆర్ఎస్ మీద బురదజల్లే కార్యక్రమమే తప్పా.. ప్రజలకు మీరు చేసిందేమీ లేదు.

రాష్ట్రవ్యాప్తంగా కొన్ని వేల చెక్ డ్యాములు కట్టి, మిషన్ కాకతీయలో చెరువులను పునరుద్ధరణ చేసి, ప్రాజెక్టులకు రూపకల్పన చేసి, లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చింది బీఆర్ఎస్. ఈ మూడేళ్లలో మీరు చేసిందేంటి? తప్పు చేసింది మీరు, నీళ్లు లేని చోట ప్రాజెక్ట్ కట్టింది మీరు, ఏడేళ్లు అధికారంలో ఉండి అనుమతులు తేనిది మీరు'' అంటూ కాంగ్రెస్ సర్కార్ పై విరుచుకుపడ్డారు హరీశ్ రావు.

#Harish Rao#Brs#Cm Revanth Reddy#Telangana Congress#Siddipet#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి