Bilkis Bano Case: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బిల్కిస్ బానో సామూహిక అత్యాచారం, కుటుంబ సభ్యుల హత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో జీవితఖైదు అనుభవిస్తున్న ఇద్దరు దోషులకు సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది. దాదాపు 17 ఏళ్లకు పైగా జైలు శిక్ష అనుభవించిన బిపిన్‌చంద్ జోషి, ప్రదీప్ రామన్లాల్లకు విధించిన యావజ్జీవ కారాగార శిక్షను నిలిపివేస్తూ, షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. వారిని తక్షణమే జైలు నుంచి రిలీజ్ చేయాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.
17 ఏళ్ల శిక్ష, వైకల్యాన్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం
2017లో బాంబే హైకోర్టు తమకు విధించిన జీవితఖైదును సమర్థిస్తూ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఈ దోషులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తమ శిక్షను నిలిపివేయాలని కోరుతూ వారు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం, సుదీర్ఘ జైలు జీవితాన్ని ప్రత్యేకంగా పరిగణనలోకి తీసుకుంది. బిపిన్‌చంద్ జోషి, ప్రదీప్ రామన్‌లాల్ ఇప్పటికే 17 ఏళ్లకు పైగా జైల్లో ఉన్నారని కోర్టు ప్రస్తావించింది. వీరిలో ఒకరు తీవ్రమైన శారీరక వైకల్యంతో బాధపడుతున్న విషయాన్ని, అలాగే వారి అరెస్టుకు దారితీసిన పరిస్థితులను పరిశీలించిన న్యాయస్థానం.. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ తాజా ఉత్తర్వులు ఇచ్చింది.
నాడు విడుదల.. మళ్లీ జైలుకు.. ఇప్పుడు బెయిల్!
ఈ కేసులో దోషుల విడుదల వ్యవహారం గత కొన్నేళ్లుగా దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. 2022 ఆగస్టులో గుజరాత్ ప్రభుత్వం 'సత్ప్రవర్తన' కారణం చూపి, ఈ కేసులోని 11 మంది దోషులను ముందస్తుగా విడుదల చేసింది. ఆ జాబితాలో బిపిన్‌చంద్ జోషి, ప్రదీప్ రామన్‌లాల్ కూడా ఉన్నారు. అయితే, దోషులను అలా వదిలేయడంపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీనిపై పలువురు సుప్రీంకోర్టులో సవాలు చేయగా, 2024 జనవరిలో అత్యున్నత న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. దోషులకు శిక్ష నుంచి ఉపశమనం కల్పించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని స్పష్టం చేస్తూ, గుజరాత్ ప్రభుత్వ క్షమాభిక్ష ఉత్తర్వులను కొట్టివేసింది. దీంతో ఆ 11 మంది దోషులు తిరిగి జైలుకు వెళ్లాల్సి వచ్చింది. 2002 గుజరాత్ అల్లర్ల సమయంలో బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం జరగడంతో పాటు, మూడేళ్ల కుమార్తె సహా ఆమె కుటుంబంలోని ఏడుగురు దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. సుదీర్ఘ న్యాయ పోరాటాల మధ్య ఇప్పుడు ఇద్దరు దోషులకు బెయిల్ లభించడం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది.


